
అహ్మదాబాద్: భారత్, వెస్టిండీస్ మధ్య ఈ నెల 6 నుంచి అహ్మదాబాద్ వేదికగా వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 6న జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాల దృష్యా దూరమవుతున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ టీమిండియా వన్డే జట్టును ప్రకటించినప్పుడే వెల్లడించింది. అయితే ఆ వ్యక్తిగత కారణాలు ఏమిటనే విషయం మాత్రం చెప్పలేదు. బహుషా విశ్రాంతి కోసం అయి ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. కాగా తాజాగా రాహుల్ వన్డే మ్యాచ్‌కు దూరంగా ఉండడానికి గల కారణం బయటికి వచ్చింది. తన సోదరి వివాహం కారణంగా రాహుల్ తొలి వన్డే మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నాడు. తన సోదరి వివాహం పూర్తయ్యాక కేఎల్ రాహుల్ జట్టులో కలనున్నాడు. కనుక తొలి వన్డే మ్యాచ్‌కు రాహుల్ అందబాటులో ఉండడం లేదు. రెండో వన్డే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. అప్పటి నుంచి మొత్తం టీమిండియాతోనే ఉంటాడు. జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లలో రాహుల్ పాల్గొంటాడు.
కాగా బుధవారం టీమిండియా క్యాంపులో కరోనా కలకలం రేగింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, స్టాండ్ బై ప్లేయర్ నవదీప్ సైనీ, మరో ముగ్గురు సహాయక బృందం సభ్యులు వైరస్ బారినపడ్డారు. మొత్తం ఏడుగురికి కరోనా సోకింది. దీంతో తొలి వన్డేలో రోహిత్‌శర్మకు జతగా దిగే ఓపెనర్ ఎవరనే విషయమై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో ఓపెనర్‌గా రాణిస్తున్న మయంక్ అగర్వాల్‌ను సెలెక్టర్లు అప్పటికప్పుడు జట్టులో చేర్చారు. దీంతో రోహిత్‌కు జతగా మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగడం ఖాయమైంది. కాగా కరేబియన్లతో వన్డే, టీ20 సిరీస్‌కు సెలెకర్లు ఇప్పటికే వేర్వేరుగా రెండు జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత వన్డే జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్.
భారత టీ20 జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్‌కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేశ్అయ్యర్, చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, చాహల్, సుందర్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్, హర్షల్