విండీస్ పతనం ప్రారంభించిన సిరాజ్
266 పరుగుల టఫ్ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను టీమిండియా బౌలర్లు బెంబెలెత్తించారు. భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ కరేబియన్లు లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. ఆ జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆ జట్టు వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. 5 పరుగులు మాత్రమే చేసిన విండీస్ ఓపెనర్ షాయ్ హోప్‌ను సిరాజ్ ఎల్బీడబ్ల్యూలో ఔట్ చేశాడు. ఆ కాపేసటికే విండీస్ స్కోర్ 25 పరుగులకు చేరుకోగానే ఐదో ఓవర్‌లో దీపక్ చాహర్ చెలరేగాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్ బ్రాండన్ కింగ్(14), షమర్ బ్రూక్స్‌ను ఔట్ చేశాడు. బ్రూక్స్ డకౌట్ అయ్యాడు.
సత్తాచాటిన ప్రసిద్ధ్ కృష్ణ
ఈ క్రమంలో డారెన్ బ్రావో, కెప్టెన్ నికోలస్ పూరన్ నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని రెండో వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ప్రసిద్ధ్ కృష్ణ విడదీశాడు. 20 పరుగులు చేసిన బ్రావోను ఔట్ చేశాడు. బ్రావో ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ అందుకున్నాడు. ఆ కాసేపటికే మరోసారి చెలరేగిన ప్రసిద్ధ్ కృష్ణ 6 పరుగులు చేసిన జేసన్ హోల్డర్‌ను ఐదో వికెట్‌గా ఫెమిలియన్ పంపాడు. హోల్డర్ క్యాచ్‌ను రోహిత్ శర్మ పట్టుకున్నాడు. దీంతో 16 ఓవర్లలో 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ కష్టాల్లో పడింది.
తిప్పేసిన కుల్దీప్
ఇక విండీస్ స్కోర్ 77 పరుగుల వద్ద ఉండగా ఫాబియాన్‌ను డకౌట్ చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. ఆ కాసేపటికే 19వ ఓవర్లో 34 పరుగులు చేసిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్‌ను ఫెమిలియన్ పంపాడు. కుల్దీప్ బౌలింగ్‌లో పూరన్ ఇచ్చిన క్యాచ్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుకున్నాడు. దీంతో విండీస్ 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది.
స్మిత్ మెరుపులు
ఈ క్రమంలో విండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్ ధాటిగా ఆడుతూ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. అయితే స్మిత్ దూకుడుకు హైదారాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ కల్లెం వేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పూరన్ ఫెమిలియన్ చేరాడు. దీంతో విండీస్ 122 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది.
భాగస్వామ్యాన్ని విడదీసిన సిరాజ్
అయితే టీమిండియా విజయాన్ని ఆల్జారీ జోసెఫ్, వాల్ష్ కాసేపు అడ్డుకున్నారు. ఈ క్రమంలో 35వ ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో జోసెఫ్ ఇచ్చిన క్యాచ్‌ను ప్రసిద్ధ్ కృష్ణ జారవిడిచాడు. అంతకుముందు సిరాజ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా ఓ క్యాచ్‌ను వదిలేశాడు. ఈ క్రమంలో తొమ్మిదో వికెట్‌కు వీరిద్దరు 47 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 13 పరుగులు చేసిన వాల్ష్‌ను సిరాజ్ ఔట్ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు. వాల్ష్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ పట్టుకున్నాడు.
విండీస్ వైట్‌వాష్
29 పరుగులు చేసిన జోసెఫ్‌ను చివరి వికెట్‌గా ప్రసిద్ధ్ ఔట్ చేయడంతో టీమిండియా 96 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. విండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడేసి వికెట్లు, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. తద్వారా భారత్ చేతిలో వెస్టిండీస్ వైట్‌వాస్ అయింది.
సత్తా చాటిన శ్రేయస్, పంత్
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా సరిగ్గా 50 ఓవర్లు ఆడి 265 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్ విఫలమైనప్పటికీ మిడిలార్డర్ రాణించింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, పంత్ నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక చివర్లో దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించారు. భారత బ్యాటర్లలో శ్రేయస్ 80, పంత్ 56, దీపక్ చాహర్ 38, వాషింగ్టన్ సుందర్ 33, రోహిత్ 13, ధావన్ 10, సూర్యకుమార్ 6, కుల్దీప్ 5, సిరాజ్ 4 పరుగులు చేయగా కోహ్లీ డకౌట్ అయ్యాడుడు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 4, జోసెఫ్, వాల్ష్ రెండేసి, ఓడియన్ స్మిత్, ఫైబియన్ తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












