లాండర్ హిల్ (యుఎస్) : ఎప్పుడూ లేనిది.. అమెరికాలో టీమ్ ఇండియాతో టీ20లు ఆడిస్తున్నారేంటి అనుమానం ఇప్పుడు ప్రతీ క్రికెట్ అభిమాని మదిలోను మెదిలే ఉంటుంది. గతంలో విండీస్, న్యూజిలాండ్, శ్రీలంక వంటి జట్లతో అమెరికాలో మ్యాచ్ లు ఆడించిన ఐసీసీ.. ఆ జట్లు చేయలేని ఫీట్ ను టీమ్ ఇండియా చేసి చూపిస్తుందన్న నమ్మకంతోనే అమెరికాలో టీమ్ ఇండియాను టీ20 ఆడిస్తోంది.
ఇంతకీ ఏంటా ఫీట్ అనుకుంటున్నారా..! గతంలో విండీస్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు అమెరికాలో మ్యాచ్ లు ఆడిన సమయంలో.. స్టేడియాలు వెలవెలబోయాయి. ఆ సీన్ ను పూర్తిగా మార్చేసి స్టేడియానికి జనాన్ని రప్పించడంలో టీమ్ ఇండియా ఇమేజ్ ఉపయోగపడుతుందనే భావనలో ఉంది ఐసీసీ.

అదీగాక.. అమెరికాలో నిర్వహించిన 'క్రికెట్ ఆల్ స్టార్స్' సిరీస్ కు మంచి స్పందన రావడంతో.. దానికి కొనసాగింపుగా టీమ్ ఇండియా మ్యాచ్ లు మరింత ఎక్కువ జనాన్ని స్టేడియాలకు రప్పిస్తాయనే యోచనలో ఉంది ఐసీసీ. భారతీయులతో పాటు అమెరికాలో ఆసియా వాసులు కూడా అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలోనే టీమ్ ఇండియా మ్యాచ్ అమెరికన్లలో క్రికెట్ పట్ల క్రేజ్ ను పెంచుతుందన్న ధీమాతో ఐసీసీ ఉంది.
ఇదిలా ఉంటే.. నేటి సాయంత్రం 7.30 గం.ల సమయంలో భారత్ విండీస్ మధ్య జరగబోయే తొలి టీ20 అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే.