

హైదరాబాద్: భారత్-వెస్టిండీస్ తొలి టెస్టు తొలి రోజు ఆటలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజ్‌కోట్ స్టేడియం స్టాండ్స్ నుంచి ఇద్దరు అభిమానులు మైదానంలో లోపలికి వచ్చేశారు. విరామం అనంతరం బ్యాటింగ్‌కు వెళ్తున్న కోహ్లి దగ్గరికి వెళ్లారు. భద్రత సిబ్బంది వారిని ఆపలేకపోయారు. కోహ్లితో సెల్ఫీ కోసమే అభిమానులు ఈ సాహసం చేశారు. విరాట్ వారిని నిరాశపరచకుండా సెల్ఫీ దిగాడు. ఈలోపు భద్రత సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని బయటికి తీసుకెళ్లారు.
రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు టీమిండియా పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. అంతగా అనుభవం లేని వెస్టిండిస్ బౌలర్లను భారత బ్యాట్స్‌మన్ ఓ ఆటాడుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి సేన.. యువ ఓపెనర్ పృథ్వీ షా (134) సెంచరీతో పాటు పుజారా (86), కోహ్లీ (72 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 364 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (17 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(72 బ్యాటింగ్) పరుగులతో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మూడు పరుగుల వద్దే లోకేశ్ రాహుల్ వికెట్‌ను కోల్పోయింది. గాబ్రియల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయిన రాహల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారాతో కలిసి పృథ్వీషా అద్భుత ప్రదర్శన చేశాడు.
కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్నా.. ఆ ఒత్తిడేమీ అతడిలో కనిపించలేదు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పృథ్వీషా... కేవలం 99 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. పుజారాతో కలిసి పృథ్వీషా అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించారు.