
హైదరాబాద్: మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా జట్టులో ఉన్నప్పుడు కూడా భారత్‌లో వెస్టిండిస్ టెస్టు సిరీస్ గెలవలేదని ఆ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో వెస్టిండిస్ ఘోర ఓటమిని చవిచూసింది.
దీంతో ఆ జట్టు పేలవ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో భారత పర్యటనలో ఉన్న వెస్టిండిస్ జట్టుని మాటలతో వేధిస్తున్నారని హోల్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తొలి టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ట్విట్టర్‌లో "వెస్టిండీస్ క్రికెట్ పైన నాకెంతో గౌరవం ఉంది. అయితే మీ అందరికీ నాదో ప్రశ్న. ఈ వెస్టిండీస్ జట్టు రంజీ ట్రోపీ ప్లేట్ గ్రూప్ దశ నుంచి క్వార్టర్స్‌కి అర్హత సాధించగలుగుతుందా? ఇలా అయితే సాధ్యం కానట్టే అనిపిస్తోంది" అని ట్వీట్ చేశాడు.
భజ్జీ ట్వీట్‌పై వెస్టిండిస్ మాజీ క్రికెటర్లతో పాటు ఆ జట్టులోని ఆటగాళ్లు సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి హైదరాబాద్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విండిస్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ మీడియాతో మాట్లాడుతూ "తొలి టెస్టులో విండీస్ ప్రదర్శనపై ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. టెస్టుల్లో నంబర్‌వన్ జట్టుతో వారి సొంతగడ్డపై మేం ఆడుతున్నామని మరిచిపోవద్దు" అని అన్నాడు.
"మేము టెస్టుల్లో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న టీమిండియాతో తలపడుతున్నాం. అదీ వారి సొంతగడ్డపై.. 1994 నుంచి ఇక్కడ టీమిండియాని ఓడించిన చరిత్ర వెస్టిండిస్‌కి లేదు. జట్టులో బ్రియాన్ లారా లాంటి దిగ్గజ క్రికెటర్ ఉన్నా అది సాధ్యం కాలేదు. నిజమే.. అందరూ ఆశించినట్లు మేము ఎక్కువ సిరీస్‌లు గెలవలేకపోయాం. కానీ, గత ఏడాదికాలంగా మెరుగ్గానే ఆడుతున్నాం. నాలుగైదు సిరీస్‌లు ఆడి.. రెండింటిలో గెలుపొందాం. అయినా మాపై ఎందుకు ఇలా బాధాకరమైన విమర్శలు గుప్పిస్తున్నారో? అర్థం కావడం లేదు" అని ఆవేదన చెందాడు.