

హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరగనున్న మిగతా మూడు వన్డేలకు 15 మందితో కూడిన భారత జట్టుని గురువారం సెలక్టర్లు ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు దూరమైన ప్రధాన పేస్ బౌలర్లు భువనేశ్వర్‌కుమార్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. తొలి రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులిచ్చిన షమీని సెలక్టర్లు పక్కన బెట్టారు.
గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికట్ల తేడాతో విజయం సాధించగా... విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లు తేలిపోయారు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
చివరి మూడు వన్డేలకు జట్టులో భువనేశ్వర్, బుమ్రా ఇద్దరూ రావడంతో భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా పుణె వేదికగా శనివారం మూడో వన్డే ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత 29న ముంబై వేదికగా నాలుగో వన్డే, నవంబరు 1న తిరువనంతపురం వేదికగా చివరి వన్డే ఆడనుంది.
చివరి మూడు వన్డేలకు భారత్ జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే