హైదరాబాద్: కరీబియన్ గడ్డపై టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. గురువారం కింగ్‌స్టన్‌లో జరిగిన చివరి వన్డేలో విండిస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.

దీంతో 3-1 తేడాతో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన రెండో వన్డేల్లో టీమిండియా విజయం సాధించగా, నాలుగో వన్డేలో వెస్టిండిస్ విజయం సాధించింది. దీంతో సిరిస్ ఫలితాన్ని తేల్చేందుకు ఐదో వన్డే కీలకంగా మారింది.
ఐదో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ భారత బౌలర్లు మహ్మద్ షమీ(4/48), ఉమేశ్ యాదవ్(3/53) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. విండిస్ బ్యాట్స్‌మెన్లలో హోప్ సోదరులు షెయ్(51), కైల్(46) రాణించారు. దీంతో విండీస్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది.

ఆనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ, దినేశ్ కార్తిక్ అర్ధ సెంచరీతో రాణించడంతో 36.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. నాలుగో వన్డేలో అనూహ్య విజయం సాధించిన విండిస్ చివరిదైన ఐదో వన్డేలో పోరాట పటిమ ప్రదర్శించలేకపోయింది.
నాలుగో వన్డేలో లాగే ఛేదనలో భారత్‌ను కట్టడి చేసి సిరీస్‌ను సమం చేయాలనుకున్న విండీస్ ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (111 నాటౌట్: 115 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల)తో కదం తొక్కడంతో చేతులేత్తేసింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించగా, సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రహానేకు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' లభించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండిస్
టీమిండియా, వెస్టిండిస్ జట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే ప్రారంభమైంది. కింగ్ స్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ సారథి జేసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకొన్నాడు. విండీస్ పర్యటన ఎంపికతో అంతర్జాతీయ వన్డేల్లో ఆరంగ్రేటం చేయాలనుకున్న రిషబ్ పంత్ ఆశలన్నీ అడియాశలయ్యాయి.

భారత్ ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో పంత్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక చివరి వన్డేలోనైన అవకాశం కల్పిస్తారని భావించినా నిరాశే ఎదురైంది. రిషబ్‌పంత్‌కి వన్డేల్లో అరంగేట్రం కోసం మరో సిరీస్ వరకు వేచి చూడాల్సిందే. గురువారం జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.
ఇక గత మ్యాచ్‌కు దూరమైన అశ్విన్, యువరాజ్‌లను కూడా తుదిజట్టులో చోటు లభించలేదు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డే రద్దు కాగా ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో కోహ్లీసేన గెలిచింది. ఇక నాలుగో వన్డేలో భారత్‌పై వెస్టిండిస్ గెలిచిన సంగతి తెలిసిందే.

జట్ల వివరాలు:
భారత్: రహానే, ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), దినేష్ కార్తీక్, ధోని, జాదవ్, పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ
వెస్టిండీస్: లూయిస్, హోప్, కేఏ హోప్, చేస్, మహమ్మద్, హోల్డర్ (కెప్టెన్), పోవెల్, నర్స్, బిషూ, జోసఫ్, విలియమ్స్