భారత్ Vs వెస్టిండిస్: గుర్తుండిపోయే నాలుగు టెస్టు మ్యాచ్‌లివే

హైదరాబాద్: ఆసియా కప్ విజయం తర్వాత టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. స్వదేశంలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్ జట్టుతో తలపడనుంది. అక్టోబర్ 4(గురువారం) రాజ్‌కోట్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్‌లో వెస్టిండిస్ రికార్డు మరీ పేలవంగా ఉంది. ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి వెస్టిండీస్ టెస్టు రికార్డు దారుణంగా ఉంది. ఈ పద్దెనిమిదేళ్లలో భారత్‌తో ఇంటా బయటా ఏడు సిరీస్‌ల్లో తలపడింది. 2001-02లో మాత్రమే అదీ సొంతగడ్డపై 2-1తో నెగ్గింది.
తర్వాతి ఆరు సిరీస్‌లను ఒక్క విజయం లేకుండానే కోల్పోయింది. చివరిసారిగా రెండేళ్ల క్రితం తమ దగ్గరే జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 0-2తో ఓడింది. ఇందులో ఒకటి ఇన్నింగ్స్ ఓటమి కాగా మరోక దాంట్లో ఏకంగా 237 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఇందులో ఒక్క టెస్టును మాత్రమే డ్రా చేసుకుంది. ప్రస్తుత సిరిస్‌లో సైతం వెస్టిండిస్ గొప్పగా రాణించే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో వెస్టిండిస్-భారత్ జట్ల మధ్య జరిగిన అద్భుతమైన టెస్ట్ మ్యాచ్‌లు మీకోసం ప్రత్యేకం:

1971 కింగ్‌స్టన్, జమైకా
భారత టెస్టు క్రికెట్‌ను ఓ మలుపు తిప్పిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో కరేబియన్లపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టెస్టు సిరిస్‌తో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర వెలుగులోకి వచ్చాడు. కరేబియన్ పర్యటనలో ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు ఇది. బిషన్ సింగ్ బేడి, ఎర్రాపల్లి ప్రసన్నలు ఏడు వికెట్లు తీయడంతో ఆతిథ్య వెస్టిండిస్ జట్టు 214 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు దిలిప్ సర్దేశాయ్(112), గవాస్కర్(65) పరుగులతో రాణించడంతో 352 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో గవాస్కర్ 67 పరుగులతో రాణించడంతో టీమిండియా విజయాన్ని కైవసం చేసుకుంది.

1997, కెన్నింగ్టన్ ఓవల్, బార్బడోస్
శివనారాయణ్ చందర్ పాల్ సెంచరీతో చెలరేగడంతో వెస్టిండిస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం భారత తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ టెండూల్కర్ (92), రాహుల్ ద్రవిడ్(78) పరుగులతో రాణించడంతో టీమిండియా 319 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ త్రయం వెంకటేశ్ ప్రసాద్, అబే కురువిల్లా, దొడ్డ గణేష్‌లు విజృంభిచడంతో వెస్టిండిస్ జట్టుని 140 పరుగులకే ఆలౌట్ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాను వెస్టిండిస్ బౌలర్లు ఆంబ్రోస్, ఇయాన్ బిషప్, రోస్‌లు 35.5 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

2002, సెయింట్ జాన్స్ స్టేడియం, ఆంటిగ్వా
ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్-విండిస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే దవడకు పెద్ద గాయమే అయింది. విండిస్ బౌలర్ మెర్విన్ దిల్లాన్ వేసిన బౌన్సర్ దెబ్బకు కుంబ్లే దవడ పగిలింది. అయినా సరే కుంబ్లే పట్టువిడవకుండా రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు పాటు బౌలింగ్ వేసి బ్రియాన్ లారాను పెవిలియన్‌కు చేర్చాడు.

2011, వాంఖడె స్టేడియం, ముంబై
ఈ మ్యాచ్‌లో ఆరుగురు వెస్టిండిస్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ 50కి పైగా పరుగులు చేయడంతో( బ్రావో 166, బారాత్ 62, బ్రాత్ వైట్ 68, ఎడ్వర్ట్స్ 86, పొలార్డ్ 81, శామ్యూల్స్ 61) తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ జట్టు 590 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ (103) సెంచరీ సాధించడంతో 482 పరుగులు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ప్రజ్ఞాన్ ఓజా(6/47), అశ్విన్ (4/34) రాణించడంతో భారత్‌కు కేవలం 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో విండిస్ బౌలర్లు సైతం రాణించడంతో టీమిండియా విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. రెండో పరుగు తీసే క్రమంలో అశ్విన రనౌట్ కావడంతో ఈ టెస్టు డ్రాగా ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications