
కటక్: బారాబతి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. అరంగేట్ర యువ పేసర్ నవ్‌దీప్ సైనీ తన వరుస ఓవర్లలో కీలక రెండు వికెట్లను ఖాతాలో వేసుకుని వెస్టిండీస్‌కు షాక్ ఇచ్చాడు. సైనీ వేసిన 32వ ఓవర్ మూడో బంతికి రోస్టన్ చేజ్ (38) ఔట్ అయ్యాడు. చేజ్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. అంతకుముందు 30వ ఓవర్ రెండో బంతికి భారీ హిట్టర్ హెట్‌మయెర్ (37) పెవిలియన్ చేరాడు. హెట్‌మయెర్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద కుల్దీప్ యాదవ్ అద్భుత క్యాచ్ పట్టాడు. వన్డేల్లో సైనీకి ఇదే మొదటి వికెట్.
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. విండీస్ ఓపెనర్లు షాయ్ హోప్, ఎవిన్ లూయిస్ ఆచితూచి ఆడారు. భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లూయిస్ మొదటి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర సైనీ చేతికి చిక్కాడు. లూయిస్ 50 బంతుల్లో మూడు బౌండరీలు సాధించాడు.
మరో నాలుగు ఓవర్ల అనంతరం నిలకడగా ఆడుతున్న హోప్.. 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పేసర్ మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. హోప్ 50 బంతుల్లో ఐదు బౌండరీలు బాదాడు. ఈ సమయంలో చేజ్, హెట్‌మయెర్ జట్టును ఆదుకున్నారు. చేజ్ స్ట్రైక్ రొటేట్ చేయగా.. హెట్‌మయెర్ రెచ్చిపోయాడు. ఈ సమయంలో సైనీ వరుస ఓవర్లలో ఈ ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో పూరం (18), పోలార్డ్ (2) పరుగులతో ఉన్నారు. విండీస్ 35 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. జడేజా, షమీ తలో వికెట్ తీయగా.. సైనీ రెండు వికెట్లు సాధించాడు.
ఈ వన్డేలో ఓపెనర్ షాయ్ హోప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే ఫార్మాట్‌లో మూడు వేల పరుగులు సాధించడం ద్వారా సరికొత్త రికార్డును లిఖించాడు. హోప్ 35 పరుగుల వద్ద ఉండగా.. మూడు వేల వన్డే పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో వేగవంతంగా ఈ ఫీట్‌ను సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. హోప్‌కు ఇది 67వ వన్డే ఇన్నింగ్స్. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్‌ను హోప్ అధిగమించాడు. అజామ్ 68 ఇన్నింగ్స్‌ల్లో మూడు వేల పరుగుల్ని సాధించాడు.