
విశాఖపట్నం: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ బౌండరీలు, సిక్సులతో రెచ్చిపోయి హాఫ్ సెంచరీ చేశాడు. 47 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 50 పరుగులు పూర్తి చేసాడు.
రాహుల్‌కు వన్డే ఫార్మాట్‌లో ఇది ఐదవ హాఫ్ సెంచరీ. మరోవైపు రోహిత్ మాత్రం తన సహజశైలికి బిన్నంగా ఆడుతున్నాడు. రాహుల్ చెలరేగుతుంటే.. రోహిత్ నెమ్మదిగా ఆడుతున్నాడు. రోహిత్ 60 బంతుల్లో 40 పరుగులే చేయడం విశేషం. రోహిత్ గేర్ మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం విండీస్ బౌలర్లు హోల్డర్, జోసెఫ్ కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. రోహిత్-రాహుల్ జోడి 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (46), రాహుల్ (63) పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు జట్టు కూర్పులో స్వల్ప మార్పులు చేశాయి. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సునీల్ అంబ్రిస్ స్థానంలో గాయపడిన స్టార్ ఓపెనర్ ఎవిన్ లెవిస్, వాల్ష్ స్థానంలో కేరీ పెరారేకు విండీస్ ఛాన్స్ ఇచ్చింది. పెరారే తన తొలి వన్డే ఆడుతున్నాడు. ఇక శివమ్ దూబే స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ అవకాశం ఇచ్చాడు.
2010 నుంచి ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 275గా ఉంటోంది. ఇక్కడ జరిగిన చివరి ఐదు వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఒక్కసారే గెలిచింది. ఈ స్టేడియంలో భారత్ ఆడిన ఎనమిది మ్యాచ్‌ల్లో 6 గెలిచి, ఒకటి ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగియగా.. ఒక ఓటమి విండీస్ చేతిలోనే ఎదురైంది. ఈ వన్డేతో విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 400 మ్యాచ్‌లు ఆడిన ఎనిమిదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు.