
హైదరాబాద్: విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 388 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు 43.3 ఓవర్లలో 280 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో మూడు వన్డేల సిరిస్ 1-1 సమం అయింది.
ఈ సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో వన్డే ఆదివారం కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టుకు శార్ధూల్ ఠాకూర్ 11వ ఓవర్‌లో షాకిచ్చాడు. ఆ ఓవర్ చివరి బంతికి ఎవిన్ లివీస్(30) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వెంటనే వరుసగా వెస్టిండిస్ రెండు వికెట్లు కోల్పోయింది. 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ జట్టుకు హోప్, పూరన్‌ల జోడీ అండగా నిలిచింది.
వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 106 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే షమీ వేసిన 30వ ఓవర్ రెండో బంతికి పూరన్(75) కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే విండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్(0) కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
అనంతరం కుల్దీప్ యాదవ్ వేసిన 33వ ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించాడు. తొలుత షాయ్ హోప్(78)ని పెవిలియన్ పంపిన కుల్దీప్... ఆ తర్వాత వరుస బంతుల్లో జేసన్ హోల్డర్, అల్జరీ జోసెఫ్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన తొలి బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన కీమో పాల్, ఖారీ పైర్రీ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం కూడా జోడించారు. నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నా వీరి జోడీని రవీంద్ర జడేజా విడదీశాడు. జడేజా వేసిన 41వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి పైర్రీ(21) ఔటయ్యాడు.
చివర్లో మహ్మద్ షమీ వేసిన 44వ ఓవర్ మూడో బంతికి పాల్(46) క్లీన్ ఔటయ్యాడు. దీంతో వెస్టిండిస్43.3 ఓవర్లలో 280 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ చెరో మూడు వికెట్లు తీయగా... రవీంద్ర జడేజా రెండు, శార్దుల్ ఠాకూర్‌కు ఒక వికెట్ లభించింది.
వెస్టిండిస్ విజయ లక్ష్యం 388
అంతకముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సులు), కేఎల్ రాహుల్(104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీలతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది.
ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. మ్యాచ్ ఆరంభం నుంచీ వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో తొలుత రాహుల్ హాఫ్ సెంచరీ చేయగా, ఆ తర్వాత రోహిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం వీరిద్దరూ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలిచారు.
రోహిత్ 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించగా, రాహుల్ 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 28వ సెంచరీ కాగా, కేఎల్ రాహుల్‌కు 3వ సెంచరీ కావడం విశేషం. అయితే అల్జరీ జోసెఫ్ వేసిన 37వ ఓవర్‌లో బౌండరీతో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్(102) ఆదే ఓవర్ చివరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అనవసరపు షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. పొలార్డ్ వేసిన 38వ ఓవర్ మూడో బంతిని స్లో షార్ట్ బాల్‌గా సంధించగా కోహ్లి పుల్ చేయబోయాడు. అది కాస్తా మిడ్ వికెట్‌లో లేవడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోస్టన్ ఛేజ్ పట్టుకున్నాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత జట్టు స్కోరు 292 పరుగుల వద్ద రోహిత్ శర్మ(138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సులు) కాట్రెల్ వేసిన 44వ ఓవర్‌లో కీపర్ హోప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లు పరుగుల వరద పారించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు సుమారు యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కాట్రెల్ వేసిన 46వ ఓవర్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సులతో పంత్ 24 పరుగులు చేయగా.. ఆ తర్వాత రోస్టన్ ఛేజ్ వేసిన ఓవర్‌లో నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌తో అయ్యర్ 31 పరుగులు రాబట్టాడు. పంత్ క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలే లక్ష్యంగా బ్యాట్ ఝుళిపించాడు. గత కొంతకాలంగా తన పవర్ హిట్టింగ్‌పై విమర్శలు చేస్తున్న వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.
జోసెఫ్ వేసిన 45 ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టిన పంత్.. కాట్రెల్ వేసిన 46వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు కొట్టాడు. అయితే, కీమో పాల్ వేసిన 48వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి రిషబ్ పంత్(39) ఔటయ్యాడు. అనంతరం 49వ ఓవర్ చివరి బంతికి అయ్యర్(53) కూడా వికెట్ కీపర్ హోప్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
చివర్లో జాదవ్ 10 బంతుల్లో 3 ఫోర్లతో అజేయంగా 16 పరుగులు సాధించడంతో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. విండిస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ రెండు వికెట్లు, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, కీరన్ పొలార్డ్‌లకు తలో వికెట్ తీశారు.