చెన్నైలో 3వ టీ20: పరువు కోసం విండిస్, క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను


హైదరాబాద్: మూడో టీ20లో విజయం సాధించి వెస్టిండిస్‌ను తొలిసారిగా వైట్ వాష్ చేయాలని టీమిండియా భావిస్తోంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆఖరి వన్డే ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, ఆఖరి టీ20లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని విండిస్ గట్టి పట్టుదలతో ఉంది.
మూడు టీ20ల సిరిస్‌ను ఇప్పటికే టీమిండియా 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు టీ20ల్లో టీమిండియా అన్ని విభాగాల్లో వెస్టిండిస్ జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించింది. రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా జోరు ముందు పర్యాటక జట్టు తేలిపోవడంతో హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ కాస్తా ఏకపక్షమైంది.

ఆఖరి టీ20లో స్వల్ప మార్పులతో బరిలోకి
ఇప్పటికే సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి టీ20లో స్వల్ప మార్పులతో బరిలోకి దిగనుంది. ఇప్పటికే మూడో టీ20కి ప్రకటించిన జట్టులో ప్రధాన పేసర్లు ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, చైనామన్ కుల్దీప్ యాదవ్‌లకు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతిని కల్పించింది. అలాగే యువబౌలర్ సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం కల్పించింది.

రెండు టీ20ల్లోనూ విఫలమైన రిషబ్ పంత్
రెండు టీ20ల్లోనూ విఫలమైన రిషబ్ పంత్‌ను తప్పించి అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను ఆడించినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరోవైపు పేసర్ ఉమేష్ స్థానంలో సిద్ధార్ధ్ కౌల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రంజీ క్రికెట్‍లో పంజాబ్ జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన సిద్దార్థ్ కౌల్‌కు ఆఖరి టీ20లో సెలక్టర్లు అవకాశమిచ్చారు.

సిద్దార్థ్ కౌల్‌కు అవకాశమిచ్చిన సెలక్టర్లు
భారత్ తరపున కౌల్ ఇప్పటివరకు మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయనప్పటికి టీ20ల్లో మాత్రం మాడు వికెట్లు తీశాడు. ఇక, కృనాల్ పాండ్యా స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా షాబాజ్ నదీమ్‌లకు తుది జట్టులో ఎంపిక చేసే అవకాశం ఉంది. కుల్దీప్‌కు విశ్రాంతి ఇవ్వడంతో చాహాల్ ఆడటం ఖాయమైంది. షాబాజ్ నదీమ్ గనుక మూడో టీ20లో ఆడితే అదే అతనికి తొలి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుంది.

3వ టీ20కి టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నదీమ్, సిద్ధార్ద్ కౌల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications