జడేజా రనౌట్ వివాదం.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి బౌండరీలైన్ దగ్గరికొచ్చిన కోహ్లీ(వీడియో)

చెన్నై: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 47.5 ఓవర్లలో 2 వికెట్లకు 291 పరుగులు చేసి విజయ భేరి మోగించింది. ఓపెనర్ షై హోప్ (151 బంతుల్లో 102 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ చేయగా.. స్టార్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మెయిర్ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నాటకీయ పరిణామం:
అయితే తొలి వన్డేలో ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రనౌట్ కాగా.. అది కాస్తా వివాదాస్పదమైంది. విషయంలోకి వెళితే... 48వ ఓవర్‌లో కీమో పాల్ వేసిన బంతిని జడేజా మిడ్ వికెట్ వైపు ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోస్టన్ చేజ్ నేరుగా విసిరిన బంతి నాన్ స్ట్రయిక్ ఎండ్‌లోని వికెట్లను గిరాటేసింది.

రిప్లేలో ఔట్:
అప్పటికి జడేజా తన బ్యాట్‌ను క్రీజులో పెట్టలేదు. జడేజా క్రీజ్‌లోకి వచ్చాడని భావించిన ఫీల్డ్ అంపైర్ షాన్ జార్జ్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మైదానంలో ఉన్న మరో అంపైర్ కూడా జడేజా రనౌట్ విషయం గమనించకపోగా.. ఫీల్డర్లు కూడా అప్పీల్ చేయలేదు. అయితే అది ఔట్‌గా రిప్లేలో తేలడంతో పొలార్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు కాసేపు చర్చించాక.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. థర్డ్ అంపైర్ జడేజాను ఔట్‌గా ప్రకటించాడు.

కోహ్లీ ఆగ్రహం:
అయితే అంత సమయం వేచి చూశాక ఔట్ ఇవ్వడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి బౌండరీలైన్ దగ్గరికొచ్చి తన అసహనాన్ని వ్యక్తం చేసాడు. ఈలోపే ఔట్ అని థర్డ్ అంపైర్ తేల్చడంతో.. జడేజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక కోహ్లీ కూడా వెనక్కి వెళ్లిపోయాడు. ఇలా అంపైర్ ఉదాసీనంగా వ్యవహరించడంపై అభిమానులు మండిపడుతున్నారు.

క్రికెట్‌లో ఎప్పుడూ చూడలేదు:
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... 'ఫీల్డర్ అడిగితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. అయితే.. టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న వ్యక్తులు అంపైర్‌ను మళ్లీ రివ్యూ అడగమని ఫీల్డర్లకు చెప్పడం క్రికెట్‌లో ఎప్పుడూ చూడలేదు. క్రికెట్‌లో ఉన్న నియమనిబంధనలేంటో అర్థం కాలేదు. ఫీల్డ్‌లో జరిగే దాన్ని స్టేడియంలో కూర్చున్న అభిమానులు నిర్ణయించేలా మరో అవకాశం ఇవ్వరని ఆశిస్తున్నా' అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications