'ఇదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్.. లక్ష్యం నిర్దేశించడం కన్నా ఛేదించడం బాగుంటుంది'

చెన్నై: అంతర్జాతీయ క్రికెట్లో ఇది నా అత్యధిక స్కోరు. ఇదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్ కూడా. లక్ష్యం నిర్దేశించడం కన్నా.. ఛేదించడం చాలా బాగుంటుంది అని విండీస్ యువ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మెయిర్ అన్నాడు. తొలి వన్డేలో టీమిండియా నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యంను విండీస్ అలవోకగా ఛేదించింది అంటే దానికి కారణం హెట్‌మెయిర్. భారత బౌలర్లపై విరుచుకుపడి (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీ చేసాడు. హెట్‌మెయిర్ 85 బంతుల్లో 4 సిక్స్‌లు, 8 ఫోర్లతో సెంచరీ చేసాడు.

ఇదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్న అనంతరం హెట్‌మెయిర్ మాట్లాడుతూ... 'అంతర్జాతీయ క్రికెట్లో ఇది నా అత్యధిక స్కోరు. ఇదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్ కూడా. లక్ష్యం నిర్దేశించడం కన్నా.. ఛేదించడం చాలా బాగుంటుంది. ఇక ఆతిథ్య జట్టుపై విజయం సాధిస్తే అది మరింత ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఈ సెంచరీ నాకు చాలా ప్రత్యేకం. ఈ ఏడాది ఆరంభంలో సెంచరీ చేయగా.. మళ్లీ చివర్లో సెంచరీ చేశా. చాలాకాలం తర్వాత సెంచరీ చేయడం ఆనందాన్ని ఇచ్చింది' అని తెలిపాడు.

మ్యాచ్‌ను ముగించకపోవడం బాధేసింది
'షై హోప్‌తో ఆడటం ఎప్పుడూ బాగుంటుంది. మేమిద్దరం క్రీజులో ఉంటే.. నేను దూకుడుగా ఆడుతా. హోప్ ప్రశాంతంగా ఆడతాడు. అనువైన బంతి దొరికితేనే బౌండరీ బాదుతాడు. నాకు ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చేందుకే ఇష్టపడుతారు. సెంచరీ చేసినా.. మ్యాచ్‌ను ముగించకపోవడంతో కాస్త బాధేసింది. అయితే గతంలో భారత్‌పై సెంచరీ చేసినప్పుడు మ్యాచ్‌ను ఓడిపోయాం. అది నాకు ఎక్కువ సంతృప్తినివ్వలేదు. ఇప్పుడు మాత్రం ఆనందంగా ఉంది' అని హెట్‌మెయిర్ పేర్కొన్నాడు.

గేల్ సలహాలు తీసుకున్నా
'బ్యాటింగ్‌ను ఆస్వాదించడమే కీలకం. కొన్నిసార్లు పరుగులు చేయొచ్చు చేయకపోవచ్చు. 2019 ఐపీఎల్‌లో రాణించలేదు. అయితే కసిగా తిరిగొచ్చేందుకు అది ఉపయోగపడుతుంది. చెన్నై పిచ్ మందకొడిగా అనిపించలేదు. పైగా మంచు కురిసింది. భారత గడ్డపై ఛేదనలో మంచు ప్రభావం ఉంటుంది. సీమర్లు బంతులేస్తున్నప్పుడు మాత్రమే బంతి కాస్త ఆగినట్టు కనిపించింది. మ్యాచ్‌లను ముగించడంపై డ్రస్సింగ్ రూమ్‌లో పొలార్డ్‌తో ఎక్కువగా మాట్లాడా. ఇన్నింగ్స్‌ను ఆరంభించడంపై క్రిస్ గేల్ సలహాలు తీసుకున్నా' అని హెట్‌మెయిర్ చెప్పుకొచ్చాడు.

సరికొత్త రికార్డు
వన్డేల్లో హెట్‌మెయిర్‌కు ఇది ఐదవ సెంచరీ కాగా.. టీమిండియాపై రెండోది. హెట్‌మెయిర్ తాజా సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఐదు వన్డే సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. హెట్‌మెయిర్ 38 ఇన్నింగ్స్‌లలోనే ఐదు సెంచరీలు చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications