
ముంబై: యువ ఓపెనర్ పృథ్వీ షాకు తగినన్ని అవకాశాలివ్వాలని టీమిండియా మహిళా జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ సూచించారు. శ్రీలంకతో ఆదివారం నుంచి జరగబోయే వన్డే, టీ20ల్లో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు షానే సరైన జోడి అని పేర్కొన్నాడు. పృథ్వీ ఇంతకుముందే టీమిండియాకు ఆడిన అనుభవం అది అని గుర్తుచేశాడు. శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ధావన్ నేతృత్వంలో 20 మంది ఆటగాళ్ల బృందం గత నెల కొలంబో వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ రెండు సిరీస్‌ల్లోనూ దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నా.. ధావన్‌తో కలిసి షా ఓపెనర్‌గా ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.
గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టులో విఫలమయ్యాక బీసీసీఐ షాను పక్కనపెట్టింది. ఈ క్రమంలోనే తన ఆటను మెరుగుపర్చుకున్న పృథ్వీ.. ఆపై దేశవాళీ క్రికెట్‌లో రాణించాడు. ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 800కు పైగా పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. అనంతరం కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్‌లో అలరించాడు. ఈ నేపథ్యంలోనే షాను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేస్తారని అంతా భావించినా.. అలా జరగలేదు. అయితే శ్రీలంక పర్యటనకు మాత్రం ఎంపిక చేశారు.
తాజాగా డబ్ల్యూవీ రామన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'ఈ పర్యటనలో ధావన్ ఓపెనింగ్ చేస్తాడనుకుంటున్నా. అందుకు రెండు కారణాలు. ఒకటి కెప్టెన్‌గా ఉండటం, రెండోది షా మరో ఓపెనర్‌గా ఆడటం. షా ఇంతకుముందే టీమిండియాలో ఆడాడు. అతడు తిరిగి ఫామ్‌లోకి రావాలంటే తగినన్ని అవకాశాలివ్వాలి. ఎందుకంటే అతడెంతో నైపుణ్యం కలిగిన ఆటగాడు. జట్టులో పడిక్కల్, రుతురాజ్, రాణా లాంటి యువకులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా.. షానే మరో ఓపెనర్‌గా తీసుకోవాలి. ఆ స్థానంలో ఇప్పటికే అతడు నిరూపించుకున్నాడు. టీమ్ మేనేజ్మెంట్ కూడా అతడినే ఎంపిక చేస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా అనుభవజ్ఞులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు' అని అన్నాడు.
'2014 ఐపీఎల్‌లోనే కోల్‌కతా నైట్ రైడర్స్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని తొలిసారి చూశా. అప్పుడు నేను ఆ జట్టుతో పనిచేశా. అదే సమయంలో సూర్యకుమార్ తొలిసారి ఐపీఎల్‌లో పాల్గొన్నాడు. అప్పటి నుంచీ అతడు బ్యాట్స్‌మన్ బాగా మెరుగయ్యాడు. కొన్నేళ్లుగా సూర్య బాగా రాణిస్తున్నా.. సరైనా గుర్తింపు రాలేదు. అలాంటి పరిస్థితుల్లోనూ నిరుత్సాహ పడకుండా అవకాశం కోసం ఎదురుచూశాడు. ఆ విషయంలో సూర్యని అభినందించాలి. రాహుల్ ద్రవిడ్ ఎంతో అనుభవజ్ఞుడు. అతడి నేతృత్వంలో యువ ఆటగాళ్లు బాగా ఆడతారు. ద్రవిడ్ ప్రశాంతమైన వ్యక్తి. అలాగే ఒక కోచ్‌కి ఉండే ఒత్తిడి ఆటగాళ్లపై రుద్దడు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపి సరైన ఫలితాలు రాబడతాడు' అని మహిళా జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ పేర్కొన్నాడు.