హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో ఆదివారం నుంచి మొదలయ్యే తొలి వన్డే కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దంబుల్లాకు చేరుకుంది. హోటల్‌కు చేరుకున్న కోహ్లీసేనకు అక్కడి సిబ్బంది ఫ్లవర్స్‌తో ఘన స్వాగతం పలికారు.
కోహ్లీ తనదైన స్టయిల్‌లో నెత్తిన టోపీతో బస్సులో నుంచి కిందకు దిగగా, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలు అతడిని అనుసరించారు. ధోనీ రావడం రావడంతో ఐస్‌క్రీమ్ అందుకొని లాగించేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.

మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌లను సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన వన్డే జట్టులో మాత్రం స్వల్ప మార్పులు చేసింది. వన్డే సిరిస్‌కు గాను పేసర్లు మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లతో పాటు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చింది.
వన్డే సిరిస్ కోసం ధోని తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు యువ ఆటగాళ్లు బుమ్రా, మనీష్ పాండే, కేదార్ జాదవ్, థాకూర్‌లకు సెలక్టర్లు చోటు కల్పించారు. ఆగస్టు 20 నుంచి ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం అవుతుండగా, అనంతరం సెప్టెంబర్ 6న ఇరు జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరిస్ ముగిసిన అనంతరం టీమిండియా తిరుగు పయనం కానుంది.