హైదరాబాద్: శ్రీలంకను అన్ని ఫార్మాట్లలో వైట్ వాష్ చేయడం చాలా ప్రత్యేకమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఆతిథ్య శ్రీలంకతో బుధవారం జరిగిన ఏకైక టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ అన్ని ఫార్మాట్లలో ఓ జట్టుని ఇలా క్లీన్‌స్వీప్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదని, ఈ ఘనత జట్టు మొత్తానికి చెందుతుందని కోహ్లీ తెలిపాడు. ఈ పర్యటనలో తమ రిజర్వ్ బెంచ్ కూడా సత్తా చాటిందని చెప్పాడు.

కేఎల్ రాహుల్, రహానేల స్థానాల మార్పు, ధావన్‌ను తప్పించి యువ క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్‌కు జట్టులో చోటు కల్పించడం వంటి ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయని కోహ్లీ చెప్పాడు. ఈ పర్యనటలో ఆటగాళ్లందరూ తమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని కోహ్లీ తెలిపాడు.
ఈ పర్యనటలో తన ఆటతీరు సంతృప్తి ఇచ్చిందన్న కోహ్లీ అన్ని ఫార్మట్లకు తగ్గట్టుగా బ్యాటంగ్ శైలిని మార్చుకుంటున్నాని కోహ్లీ చెప్పాడు. అన్ని ఫార్మట్లకు తగ్గట్టుగా ఆడటమే తన అభిమతమని అన్నాడు. కాగా, ఈ సిరిస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ సరసన చేరారు. మరోవైపు ఏకైక టీ20లో 82 పరుగులు చేసిన కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. చేజింగ్‌లో అత్యధిక పరుగుల చేసిన టీ20 క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఛేదనలోనే అత్యధిక పరుగులు (1,016) చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు. మెకల్లమ్ (1,006) రికార్డును కోహ్లీ అధిగమించాడు. డేవిడ్ వార్నర్ (892), మార్టిన్ గుప్తిల్ (882), మహమ్మద్ షెజాద్ (819) ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఇక, భారత్ తరఫున 50 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఐదో క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు.