అందుకు సచినే కారణం: 99 వద్ద ఔటవడంపై మాథ్యూస్
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఫీల్డింగ్ కారణంగా 2009లో తాను తొలి టెస్టు సెంచరీని తృటిలో చేజార్చుకున్నట్లు శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ గుర్తు చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ అనంతరం శ్రీలంక.. భారత్ పర్యటనకు రానుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 16న తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఈ సిరిస్‌లో టీమిండియాకు గట్టి పోటీనిస్తామని మాథ్యూస్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మాథ్యూస్ మాట్లాడుతూ 'భారత్‌తో జరగబోవు సిరీస్ మా జట్టుకి చాలా కఠినమైనది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు శ్రీలంక ఆటగాళ్లు గత కొద్దిరోజుల నుంచి సన్నద్ధమవుతున్నారు' అని అన్నాడు.

పాజిటివ్ మైండ్‌తో మ్యాచ్‌లు ఆడతాం
'కొద్ది నెలల క్రితం భారత్ మాపై టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. అది కూడా మా సొంతగడ్డపై. ఇప్పుడు మేం వారి సొంతగడ్డకు వెళ్తున్నాం. అలాంటప్పుడు ఈ సిరిస్ మాకు ఎంతో సవాల్‌తో కూడుకున్నది. ఫలితాలతో సంబంధం లేకుండా.. పాజిటివ్ మైండ్‌తో మ్యాచ్‌లు ఆడతాం. భారత్‌లో సిరీస్ జరిగే సమయంలోనైనా గెలుపోటముల గురించి ఆలోచించకుండా మా వంతు కృషి చేస్తాం' అని మాథ్యూస్ తెలిపాడు.

ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు
భారత్‌పై శ్రీలంక ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. 2009లో శ్రీలంక చివరిసారిగా భారత్‌లో పర్యటించింది. ముంబైలో జరిగిన ఓ టెస్టులో మాథ్యూస్ 99 పరుగుల వద్ద ఔటై తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. దీనిపై కూడా మాథ్యూస్ స్పందించాడు.

తొలి టెస్టు సెంచరీని తృటిలో చేజార్చుకున్నా
'అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. 2009లో ముంబైలో జరిగిన టెస్టులో దురదృష్టవశాత్తూ నా తొలి టెస్టు సెంచరీని తృటిలో చేజార్చుకున్న తీరు నాకింకా గుర్తుంది. ఆ టెస్టులో నేను బంతిని చక్కగా హిట్ చేశాను. బంతి దాదాపు బౌండరీ లైన్ సమీపానికి వెళ్లింది. దీంతో అప్పటికి 98 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న నేను ఒక పరుగు పూర్తి చేసి.. కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీని అందుకుంటున్నాననే ఆనందంలో రెండో పరుగు కోసం పరుగెత్తాను' అని మాథ్యూస్ అన్నాడు.

మెరుపు ఫీల్డింగ్‌తో రనౌట్ చేసిన సచిన్
'అప్పుడు సచిన్ మెరుపు ఫీల్డింగ్‌తో రనౌట్ చేశాడు. సెంచరీ మిస్సయినందుకు ఎంతో బాధతో మైదానాన్ని వీడాను. అప్పటి భారత పర్యటనలో ఎంతో నేర్చుకున్నాను' అని మాథ్యూస్ వివరించాడు. కాగా, నవంబరు 16 నుంచి శ్రీలంక వరుసగా కోహ్లీసేనతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications