
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ బాదిన ఓ భారీ సిక్సర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. డే అండ్ నైట్ టెస్టులో మొదట నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించిన అయ్యర్ ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. శ్రీలంక స్పిన్ ద్వయం లసిత్ ఎంబుల్దేనియా, ప్రవీణ్ జయవిక్రమను సునాయసంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో 54 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 44 పరుగుల వద్ద ధనుంజయ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాది శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అయ్యర్ బాదిన ఈ సిక్సర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎందుకంటే ఈ సిక్సర్ చిన్నస్వామి స్టేడియం దాటిపోవడం గమనార్హం. అసలే చిన్నస్వామి స్టేడియం చిన్నది. దీనికి తోడు అయ్యర్ భారీ సిక్సర్ బాదడంతో బంతి కాస్త గ్రౌండ్ దాటి ఏకంగా బయట ఉన్న రోడ్డుపై పడింది. ఇదే విషయాన్ని కామెంటేటర్లు సైతం ప్రస్తావించారు.
ఇక ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. బ్యాటింగ్ కష్టమైన పిచ్‌పై ఇతర బ్యాటర్లు పరుగులు చేయలేక చేతులు ఎత్తెస్తే అయ్యర్ మాత్రం చక్కటి ఆట తీరుతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. వరుసగా బౌండరీలు బాదుతూ వన్డే తరహా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్‌లో మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 92 పరుగులు చేశాడు. అయ్యర్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. అయ్యర్ విధ్వంసంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో రిషబ్ పంత్ 39, హనుమ విహారీ 31, కోహ్లీ 23, రోహిత్ 15, అశ్విన్ 13, అక్షర్ 9, షమీ 5, మయాంక అగర్వాల్ 4, జడేజా 4 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దేనియా, జయవిక్రమ మూడేసి వికెట్లు, డిసిల్వా 2, లక్మల్ ఒక వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక బ్యాటింగ్‌లో తడబడుతుంది. ఆ జట్టు 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.