కొలంబో వేదికగా శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన భారత్- శ్రీలంక తొలి వన్డే టైగా మారింది. మందకొడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే (66 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నిస్సాంక (56; 75 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/33), అర్షదీప్ సింగ్ (2/47) తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనకు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (58; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. అక్షర్ పటేల్ (33; 57 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), కేఎల్ రాహుల్ (31; 43 బంతుల్లో, 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) చెరో మూడు, వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటారు.

ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కింది. పిచ్ స్వభావంతో సంబంధం లేకుండా హిట్ మ్యాన్ చెలరేగడంతో వపర్‌ప్లేలో ఇండియా 71 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయింది. అక్షర్-కేఎల్ రాహుల్ భాగస్వామ్యంతో భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది. ఆఖర్లో దూబె (25; 24 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) కీలక పరుగులతో విజయ సమీకరణం 15 బంతుల్లో ఒక్క పరుగుగా మారింది. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. కానీ అలసంక వరుసగా దూబె, అర్షదీప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో టైగా మారింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. గెలిచే మ్యాచ్ ఓడిపోవడం నిరాశ కలిగించిందని, అయితే ఆఖరి వరకు పోరాడటం గర్వంగా ఉందని అన్నాడు. ఛేదనలో చాలా సందర్భాల్లో బాగానే ఆడామని, కానీ ఆ మూమెంట్ ఆద్యంతం కొనసాగించలేకపోయామని తెలిపాడు. గొప్ప ఆరంభం లభించినా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆధిపత్యం చేజారిందని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
''''ఇది ఛేదించే స్కోరే. కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే సాధించవచ్చు. చాలా సందర్భాల్లో మంచి బ్యాటింగ్ చేశాం. కానీ దాన్ని ఆద్యంతం కొనసాగించలేకపోయాం. మేం గొప్పగా ఆరంభించాం. 10 ఓవర్ల తర్వాత స్పిన్నర్లు వస్తారని, అప్పుడు అసలైన ఆట మొదలవుతుందని తెలుసు. ఆదిలో పైచేయి సాధించినా, తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపించింది''
''అక్షర్ పటేల్-కేఎల్ రాహుల్ భాగస్వామ్యంతో తిరిగి పోటీలోకి వచ్చాం. కానీ ఆఖర్లో 14 బంతుల్లో ఒక్క పరుగు చేయలేకపోవడం నిరాశకు గురిచేసింది. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. శ్రీలంక బాగా ఆడింది. ఆఖరివరకు మేం పోరాడిన తీరు గర్వంగా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లు మధ్య దోబుచూలాడింది. ఆ ఒక్క పరుగు చేయాల్సింది'' అని రోహిత్ పేర్కొన్నాడు.