
మరో 19 పరుగులు చేస్తే
నేడు ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో 19 పరుగులు చేస్తే ఈ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా 1000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును సైతం హిట్‌మ్యాన్ బద్దలు కొడతాడు. టీ20 ఫార్మాట్‌లో వేగంగా 1000 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా 981 పరుగులు చేసిన రోహిత్ నేటి మ్యాచ్‌లో 19 పరుగులు చేస్తే 26 మ్యాచ్‌ల్లో 1000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఈ రికార్డును కోహ్లీ 30 మ్యాచ్‌ల్లో అందుకోగా, ధోని 57 మ్యాచ్‌ల్లో అందుకున్నాడు.

ఆ జాబితాలో..
అలాగే కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరో 19 పరుగులు చేస్తే టీ20ల్లో వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో చేరుతాడు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు కెప్టెన్లుగా ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మాత్రమే వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.

విలియమ్సన్, రికార్డులు బ్రేక్
ఇప్పటివరకు స్వదేశంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టీ20ల్లో 16 మ్యాచ్‌లు ఆడి, 15 గెలిచింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డులను రోహిత్ శర్మ సమం చేశాడు. నేడు ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే స్వదేశంలో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా రోహిత్‌శర్మ రికార్డు సృష్టిస్తాడు.
ఈ క్రమంలో 16 విజయాలతో విలియమ్సన్, మోర్గాన్‌ను రోహిత్ అధిగమిస్తాడు. కాగా టీ20 ఫార్మాట్‌లో స్వదేశంలో ఇండియా కోహ్లీ కెప్టెన్సీలో 13, ధోని కెప్టెన్సీలో 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఇక హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో ఇప్పటివరకు టీమిండియా ఇంటా, బయట కలిపి టీ20 ఫార్మాట్‌లో 24 మ్యాచ్‌ల్లో 22 గెలిచింది.

నేడే రెండో టీ20
భారత్, శ్రీలంక మధ్య ధర్మశాల వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరో వైపు శ్రీలంక మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.


Click it and Unblock the Notifications












