
ధర్మశాల: శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఇది బ్యాటింగ్‌లో కాదు. ఫీల్డింగ్‌లో.. నిజానికి ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 2 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేశాడు. చమీర బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. అయితే అంతకుముందు శ్రీలంక బ్యాటింగ్ సమయంలో రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 50 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో శ్రీలంక వికెట్ కీపర్ చండీమాల్ క్యాచ్‌ను అందుకోవడం ద్వారా రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు.
ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. అలాగే మొత్తంగా నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఎక్కువ క్యాచ్‌లు పట్టిన జాబితాలో పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్‌తో కలిసి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా ఫీల్డర్ డేవిడ్ మిల్లర్ తొలి స్థానంలో ఉన్నాడు. మిల్లర్ ఇప్పటివరకు 69 క్యాచ్‌లు పట్టాడు. ఇక 64 క్యాచ్‌లతో న్యూజిలాండ్ ఫీల్డర్ మార్టిన్ గుప్తిల్ రెండో స్థానంలో ఉన్నాడు.
కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 75 పరుగులతో చెలరేగాడు. అతనికి తోడుగా శనక 19 బంతుల్లోనే 47 పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.