కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన పలు రికార్డులు బద్దలుకొట్టాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ లంక వన్డే సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ శుభారంభం అందించాడు.
మందకొడి పిచ్ అయినప్పటికీ, ఎప్పటిలానే పిచ్ స్వభావంతో సంబంధం లేకుండా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. 33 బంతుల్లో అర్ధశతకం బాదాడు. మొత్తంగా 47 బంతుల్లో 58 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు సాధించాడు. అయితే ఈ క్రమంలో కొన్ని రికార్డులు నమోదుచేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరిట ఉండేది. మోర్గాన్ సారథిగా 180 ఇన్నింగ్స్‌ల్లో 233 సిక్సర్లు కొట్టాడు. ఈ రికార్డును రోహిత్ 134 ఇన్నింగ్స్‌ల్లోనే అధిగమించడం విశేషం. అంతేగాక మరో రెండు రికార్డులు నమోదు చేశాడు.
ఓపెనర్‌గా రోహిత్ 15 వేల పరుగులను మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 15వేల పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. సచిన్ 331 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించగా, హిట్ మ్యాన్ 352 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడు. ఇక వన్డేల్లో పది ఓవర్లలోపే అత్యధిక అర్ధశతకాలు బాదిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (7), రోహిత్ (3), సచిన్ (1), రాబిన్ ఉతప్ప (1), గౌతమ్ గంభీర్ (1) ఉన్నారు.