కపిల్ దేవ్ రికార్డు బద్దలు
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో లంక బ్యాటర్ చరిత్ అసలంకను ఔట్ చేయడం ద్వారా ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 435 వికెట్లతో 434 వికెట్లు తీసిన కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. అశ్విన్ కంటే ముందు 619 వికెట్లతో అనిల్ కుంబ్లే ఉన్నాడు. అశ్విన్ 85 టెస్టు మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకోవడం గమనార్హం. అలాగే టెస్టు క్రికెట్లో 400కు పైగా వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్ అశ్విన్ అనే సంగతి తెలిసిందే. కాగా ఇదే మ్యాచ్‌లో 431 వికెట్టు తీసిన న్యూజిలాండ్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీని, 432 వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్‌ను సైతం అశ్విన్ అధిగమించాడు.
మొత్తంగా తొమ్మిదో స్థానంలో..
ప్రపంచవ్యాప్తంగా టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ మొదటి స్థానంలో ఉన్నాడు. మురళీధరన్ 133 మ్యాచ్‌ల్లో 800 వికెట్లు తీశాడు. ఆ తర్వాత రెండో స్థానంలో 145 టెస్టు మ్యాచ్‌ల్లో 708 వికెట్లతో ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ ఉన్నాడు. 169 టెస్టు మ్యాచ్‌ల్లో 640 వికెట్లతో ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్స్‌న్ మూడో స్థానంలో ఉన్నాడు.

నాల్గో స్థానంలో కుంబ్లే
132 టెస్టుల్లో 619 వికెట్లతో టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక ఐదో స్థానంలో గ్లెన్ మెక్‌గ్రాత్ ఉన్నాడు. అతను 124 టెస్టు మ్యాచ్‌ల్లో 563 వికెట్లు తీశాడు. ఇక 152 టెస్టుల్లో 537 వికెట్లతో ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆరో స్థానంలో ఉన్నాడు. 132 టెస్టుల్లో 519 వికెట్లతో కోర్ట్నీ వాల్ష్ ఏడో స్థానంలో ఉన్నాడు. 93 టెస్టుల్లో 439 వికెట్లతో సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక 85 టెస్టుల్లో 435 వికెట్లతో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications












