
కొలంబో: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల వర్షం కురిపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుంచే బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును వేగంగా పరుగెత్తించాడు. మొదటి ఓవర్లో రెండు, రెండో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదిన షా.. మూడో ఓవర్లో ఒక ఫోర్ బాదాడు. ఇక నాలుగో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. ఐదవ ఓవర్లో మరో మూడు ఫోర్లు బౌండరీకి తరలించి లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు షా బాడుతుంటే.. మరోవైపు శిఖర్ ధావన్ అలా చూస్తుండిపోయాడు. అయితే అదే ఊపులో ఆరవ ఓవర్లో షా పెవిలియన్ చేరాడు.
పృథ్వీ షా 24 బంతుల్లో 9 బౌండరీల సాయంతో 43 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ధనంజయ్ డిసిల్వా వేసిన ఆరవ ఓవర్ మూడు బంతిని భారీ షాట్ ఆడగా.. అవిష్కా ఫెర్నాండో క్యాచ్ అందుకున్నాడు. దాంతో భారత్ 58 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచులో షా.. డిసిల్వా వేసిన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. షా అనంతరం క్రీజులోకి వచ్చిన హిట్టర్ ఇషాన్ కిషన్ కూడా చెలరేగిపోయాడు. తాను ఎదుర్కొన్న మొదటి రెండు బంతులను సిక్స్, ఫోర్‌గా మలిచాడు. ఆపై ఇషాన్ కూడా హ్యాట్రిక్ ఫోర్లు బాది భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. మరోవైపు ధావన్ మాత్రం నెమ్మదిగా ఆడుతూన్నాడు. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో టెయిలెండర్లు కరుణరత్నె (43 నాటౌట్; 35 బంతుల్లో 1x4, 2x6), చమీరా (13; 7 బంతుల్లో 1x4, 1x6) ధాటిగా ఆడి లంక జట్టుకు భారీ స్కోర్ అందించారు. కెప్టెన్ దాసున్ షనక (39; 50 బంతుల్లో 2x4, 1x6), అసలంక (38; 65 బంతుల్లో 1x4) నిలకడగా ఆడి ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (32; 35 బంతుల్లో 2x4, 1x6), మినోద్ భానుక (27; 44 బంతుల్లో 3x4) మంచి శుభారంభం ఇచ్చారు. భారత బౌలర్లలో యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చహర్ తలో రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.