
బెంగళూరు: పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన రోహిత్ సేన రెండో రోజు కూడా పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసిన శ్రీలంక విజయానికి 419 పరుగులు దూరంలో ఉంది. క్రీజులో క్రీజులో కెప్టెన్ కరుణరత్నే (10), కుశాల్ మెండీస్ (16) ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లోనే తిరిమాణేను ఎల్బీగా డకౌట్ చేశాడు. లక్ష్యం భారీగా ఉండడంతో ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం ఖాయమైందనే చెప్పుకోవాలి.
సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో చెలరేడంతో టీమిండియా 300కు పైగా పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 143 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని శ్రీలంక ముందు టీమిండియా 447 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్‌ను 303-9 వికెట్ల వద్ద డిక్లేర్ చేశారు. అక్షర్ పటేల్ ఔటైన వెంటనే స్కోర్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 68.5 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 67, రిషబ్ పంత్ 50, రోహిత్ శర్మ 46, హనుమ విహారీ 35, మయాంక్ అగర్వాల్ 22, రవీంద్ర జడేజా 22, విరాట్ కోహ్లీ 13, రవిచంద్రన్ 13, మహ్మద్ షమీ 16*, అక్షర్ పటేల్ 9 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రవీణ్ జయవిక్రమ 4, లసిత్ ఎంబుల్దేనియా 3, విశ్వ ఫెర్నాండో, డిసిల్వా తలో వికెట్ తీశారు. కాగా కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన లక్మల్ ఈ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.
86-6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక కాసేపటికే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒక్క పరుగు చేసిన ఎంబుల్దేనియి వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే 5 పరుగులు చేసిన లక్మల్‌ను అశ్విన్ అద్భుత బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో 21 పరుగులు చేసిన డిక్వెల్లా.. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మళ్లీ తర్వాతి ఓవర్లోనే 8 పరుగులు చేసిన విశ్వ ఫెర్నాండో అశ్విన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక 109 పరుగులకే కుప్పకూలింది. రెండో రోజు ఆటలో 84 ఓవర్లపాటు మ్యాచ్ జరగగా 354 పరుగులు వచ్చాయి. అదే సమయంలో 14 వికెట్లు నెలకూలాయి.