హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాగా తన బౌలింగ్‌ను ఎవరూ జడ్జ్ చేయలేరని యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 31 (గురువారం) నాలుగో వన్డే ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ధోని తన లాంటి యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడని కుల్దీప్ కొనియాడాడు. గత ఆరు నెలలుగా ధోనితో తరచూ మాట్లాడుతన్నానని, తన ఆటతీరు మెరుగు పర్చుకోవడానికి అమూల్యమైన సలహాలు ఇచ్చాడని చెప్పాడు.

శ్రీలంక పర్యటనలో ధోని నుంచీ చాలా నేర్చుకునేందుకు గొప్ప అవకాశం దొరికిందని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. 'ధోని లాగా నా బౌలింగ్‌ను ఎవరూ జడ్జ్ చేయలేరు. వికెట్ల వెనుక నిలబడి తనకు కావాల్సిన విధంగా బౌలింగ్ చేయించుకుంటాడు. ధోని 300 వన్డే మ్యాచ్‌లో తాను ఆడటం తన అదృష్టంగా భావిస్తున్నా, అది తనకు చాలా గర్వంగా ఉంది' అని పేర్కొన్నాడు.
దీంతో పాటు కోచ్‌ల మార్పిడి గురించి అడిగిన ప్రశ్నకు గాను అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి ఇద్దరూ తనని ఒకేలా చూశారని చెప్పాడు. వారిద్దిరిలో తనకు ఎటువంటి తేడా కనిపించలేదని చెప్పుకొచ్చాడు. తన ఆటతీరు మెరుగుపర్చుకోవడం గురించి ఇద్దరు విలువైన సలహాలు ఇచ్చారని అన్నాడు.
ఈ ఏడాది టీమిండియాకు దొరికిన బౌలింగ్ ఆణిముత్యాల్లో కుల్దీప్ యాదవ్ ఒకడు. ఈ ఏడాది మార్చిలో ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. శ్రీలంక పర్యటనకు ముందు వెస్టిండిస్‌తో జరిగిన వన్డే సిరిస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు.