హైదరాబాద్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక, భారత్ జట్ల మధ్య తొలి వన్డేలో దంబుల్లా వేదికగా ఆదివారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ సన్నద్దతకు ఆటగాళ్ల ఫిటెనెస్‌ను బీసీసీఐ పరీక్షించనుండగా, శ్రీలంక కనీసం రెండు మ్యాచ్‌లైనా గెలవకపోతే ప్రమాదంలో పడుతుంది.
ఇప్పటికే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను క్లీన్‌స్వీప్ చేసి కోహ్లీసేన మంచి ఊపు మీద ఉండగా... శ్రీలంక మాత్రం పరువు కోసం ప్రయత్నిస్తోంది. వన్డే సిరీస్‌ని లంకేయులు దక్కించుకోని పక్షంలో అభిమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనుంది. దంబుల్లాలో భారత్, శ్రీలంకల మధ్య 11 మ్యాచ్‌లు జరగ్గా శ్రీలంక కేవలం 4 వన్డేల్లోనే విజయం సాధించింది.

కెప్టెన్ కోహ్లీ 2008లో తన వన్డే క్రికెట్ కెరీర్‌ను ఇక్కడే మొదలెట్టాడు. దీంతో తొమ్మిదేళ్ల అనంతరం మళ్లీ విరాట్ కోహ్లీ ఏ విధంగా బ్యాటింగ్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో తొలి వన్డే నుంచి అటు విరాట్ కోహ్లీ, ఇటు తరంగా ఆధిపత్యం సాధించడంపైనే గురిపెట్టాల్సి ఉంటుంది.
ఈ సిరీస్‌లో రెండు వన్డేలను గెలిస్తే 2019 ప్రపంచకప్‌కు నేరుగా శ్రీలంక అర్హత సాధించనుంది. ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతున్నది. ఈ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకోవాలంటే లంకతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కనీసం 4-1తో గెలిచి తీరాలి. ఒకవేళ 3-2తో నెగ్గినా ర్యాంకుని కోల్పోయే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న 114 పాయింట్లలో ఓ పాయింట్‌ను కోల్పోతుంది. తద్వారా భారత్ నాలుగో ర్యాంక్‌కు పడిపోతుంది. ఇంగ్లండ్ మూడో ర్యాంక్‌కు ఎగబాకుతుంది. ఇక, శ్రీలంక సిరిస్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి పరీక్ష కానుంది.
36 ఏళ్ల ధోనీ 2019 ప్రపంచ కప్‌లో స్థానం సాధించాలంటే తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తాజా జట్టులో ఇతర వికెట్ కీపర్ ఎవర్ని తీసుకోలేదు. దీంతో అతడ్ని పరీక్షించే యోచనలో సెలక్టర్లు ఉన్నారు. ఐదో స్థానంలో ధోనీ బరిలో దిగనుండగా, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య ఏడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.
టెస్టుల్లో ఓపెనర్‌గా సత్తా చాటిన కేఎల్ రాహుల్ ఇప్పుడు వన్డేల్లో నాలుగో స్థానంలో రాహుల్ బరిలో దిగుతాడని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం ఆరు వన్డేల్లోనే కేఎల్ రాహుల్ ఆడిన అనుభవం ఉంది. 2016లో జింబాబ్వే వన్డే సిరీస్‌తో వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో ఓపెనర్‌గా కేవలం 24 పరుగులే చేశాడు. ఆ తర్వాత గాయాల బారిన పడి జట్టుకు పలుమార్లు దూరం అయ్యాడు. నాలుగో స్ధానంలో బ్యాట్స్‌మెన్‌గా 2015 నుంచి రహానే తన అద్భుత ప్రదర్శన చేస్తూ జట్టులో స్థానాన్ని నిలుపుకున్నాడు.
ఇక ఓపెనింగ్ జోడిగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు బరిలోకి దిగనున్నారు. ఈ సిరిస్‌కు గాను రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. దీంతో వైస్ కెప్టెన్‌గా జట్టులో రోహిత్ శర్మ నిలదొక్కుకోకపోతే ఓపెనర్‌గా మనీష్ పాండే, కేదారీ జాదవ్‌లతో ఆ స్థానాన్ని భర్తీ చేసే యోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది.
ఇక పేస్ బౌలర్లుగా భువనేశ్వర్‌తో బుమ్రా బంతిని పంచుకోనుండగా, స్పిన్ బౌలర్ల స్ధానంలో చైనామన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్‌కు చోటు కల్పించే అవకాశం లేకపోలేదు.