
హైదరాబాద్: లీడ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బుమ్రా శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కొత్త బంతితో విజృంభించిన భారత బౌలర్లు శ్రీలంక ఓపెనర్లను పెవిలియన్ పంపి భారత్‌కు శుభారంభాన్నందించాడు. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. నాలుగో ఓవర్‌లో ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నెను ఔట్ చేసిన బుమ్రా... ఎనిమిదో ఓవర్‌లో కుశాల్ పెరీరాను ఔట్ చేశాడు.
ఈ ఇద్దరూ వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ ఆదుకునే ప్రయత్నం చేయగా రవీంద్ర జడేజా బంతి అందుకున్న తొలి ఓవర్‌లోనే కుశాల్ మెండిస్(3)ను పెవిలియన్ పంపాడు. జడేజా వేసిన 11వ ఓవర్ నాలుగో బంతిని ముందుకొచ్చి ఆడేందుకు కుశాల్ యత్నించగా ధోని స్టంపౌట్ చేశాడు.
దీంతో 53 పరుగులకే శ్రీలంక మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రెండు పరుగులకే అవిష్క ఫెర్నాండో(20)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. దీంతో 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 20 ఓవర్లకు గాను శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. మాథ్యూస్(19), తిరుమన్నె(10) పరుగులతో క్రీజులో ఉన్నారు.