
బెంగళూరు: విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్‌ను వీక్షించడానికి మొహాలీ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదని నిరాశలో ఉన్న అభిమానులకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఊరటనిచ్చే శుభవార్త చెప్పింది. శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరిగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ మీనన్ ధృవీకరించారు. ఈ మేరకు ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ సంతోష్ మీనన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో భారత్, శ్రీలంక టెస్టు మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరగా అందుకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. స్టేడియంలోకి 50 % ప్రేక్షకులను అనుమతించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతించడంపై సంతోషం వ్యక్తం చేసిన సంతోష్ మీనన్ కరోనా ప్రోటోకాల్ ప్రకారం మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
కాగా బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరగనుంది. తొలి సారిగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదిలి పెట్టమని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ మీనన్ తెలిపారు.
ఈ టెస్టు మ్యాచ్ మార్చి 12 నుంచి 16 మధ్య జరగనుంది. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌గా జరగనున్న ఈ మ్యాచ్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది. ఇక మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను మార్చి 1 నుంచి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మార్చి 6 నుంచి టికెట్లు స్టేడియం వద్ద ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. టికెట్ల ధరలు 100 రూపాయల నుంచి 2,500 రూపాయల మధ్య ఉన్నాయి.
అలాగే ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పాఠశాల విద్యార్థులను ఆహ్వానించే ఆలోచనలో ఉంది. కాగా బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు మొహాలీ వేదికగా మార్చి 3 నుంచి 8 మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు.