మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్‌కు శ్రీలంక సవాలైన లక్ష్యాన్ని నిర్దేశించింది. మందకొడి పిచ్‌పై నిర్ణీత 50 ఓవర్లలో లంక ఎనిమిది వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే (66 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నిస్సాంక (56; 75 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/33), అర్షదీప్ సింగ్ (2/47) తలో రెండు వికెట్లు తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను సిరాజ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఫెర్నాండో (1)ను సిరాజ్ మూడో ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత వికెట్‌ను కాపాడుకోవాలని ప్రయత్నించిన లంక ఎక్కువ సేపు నిలవలేకపోయింది. కుశాల్ మెండిస్ (14)ను శివమ్ దూబె, సమరవిక్రమ (8)ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంలో లంక 60 పరుగులకే కీలక మూడు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత భారత్ క్రమంగా వికెట్లు తీస్తున్నా ఓపెనర్ నిస్సాంక మరో ఎండ్‌లో నిలబడి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. అయితే అర్ధశతకం సాధించిన నిస్సాంకను సుందర్ చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక లంక పనైపోయిందనుకున్న తరుణంలో 21 ఏళ్ల వెల్లలాగె అద్భుత పోరాటం చేశాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టాడు.
వెల్లలాగేకు జనిత్ లియాంగె (20; 26 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), హసరంగ (24; 35 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), అఖిల ధనంజయ (17; 21 బంతుల్లో, 2 ఫోర్లు) చక్కని సహకారం అందించారు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్, అక్షర్ చెరో రెండు, సిరాజ్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బౌలింగ్ వేయడం విశేషం. అయితే ఓ ఓవర్ వేసిన గిల్ సిక్సర్‌తో 14 పరుగులు సమర్పించుకున్నాడు.