హైదరాబాద్: టీమిండియా తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన శ్రీలంక జట్టుకి ఊరట కలిగించే శుభవార్త ఇది. అనారోగ్యం కారణంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్టుకి దూరమైన ఆ జట్టు కొత్త కెప్టెన్ దినేశ్ చండిమాల్ రెండో టెస్టులో బరిలోకి దిగనున్నట్లు శ్రీలంక క్రికెట్ జట్టు మేనేజర్, సెలక్టర్ గురుసిన్హా వెల్లడించారు.
తొలి టెస్టు ప్రారంభానికి ముందు టెస్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్ అనారోగ్యంతో దూరమయ్యాడు. న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న చండీమాల్ రెండో టెస్టుకి అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

కొలంబో వేదికగా ఆగస్టు 3 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. 'దినేశ్ చండిమాల్ ఫిటెనెస్ సాధించినట్లే కనిపిస్తోంది. అతను గత రెండు రోజుల నుంచి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు' అని జట్టు మేనేజర్ ఆసంక గురుసిన్హా మీడియాతో స్పష్టం చేశారు.
'తదుపరి టెస్టులో ఆడేందుకు దినేశ్ చండీమాల్ సిద్ధమవుతున్నాడు. గత రెండు రోజుల నుంచి బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు. చండీమాల్ స్థానంలో బాధ్యతలు అందుకున్న రంగన హెరాత్ గాయం కారణంగా రెండో టెస్టులో ఆడే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు' అని అన్నారు.
అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే... చివరి నిమిషంలోనైనా అతన్ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన సిరీస్‌లో జట్టు పేలవ ప్రదర్శనకి బాధ్యత వహిస్తూ శ్రీలంక కెప్టెన్సీ బాధ్యతల నుంచి మాథ్యూస్ తప్పుకున్న విషయం తెలిసిందే.
అనంతరం కొత్త కెప్టెన్‌గా చండిమాల్‌ని శ్రీలంక బోర్డు నియమించినా.. తొలి టెస్టు ఆరంభానికి ముందే అతను అనారోగ్యం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్ హెరాత్ తొలి టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. మరోవైపు జ్వరం కారణంగా గాలే టెస్టుకి దూరమైన కేఎల్ రాహుల్ ఫిటెనెస్ సాధించాడు.