
బెంగళూరు: భారత్, శ్రీలంక మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా ప్రారంభమైన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో తొలి రోజు ఏకంగా 16 వికెట్లు నెలకులాయి. అదే సమయంలో పరుగులు కూడా బాగానే వచ్చాయి. 89.1 ఓవర్ల పాటు సాగిన తొలి రోజు ఆటలో ఇరు జట్లు కలిసి 338 పరుగులు చేశాయి. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 92 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 98 బంతుల్లోనే 92 పరుగులు చేసిన అయ్యర్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఇతరులెవరూ సహకరించకపోయినప్పటికీ శ్రేయస్ ఒంటరి పోరాటం చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
మిగతా బ్యాటర్లలో రిషబ్ పంత్ 39 (7 పోర్లు) , హనమ విహారీ 31 (4 ఫోర్లు), కోహ్లీ 23 (2 ఫోర్లు), రోహిత్ శర్మ 15 (ఒక ఫోర్, ఒక సిక్సు), అశ్విన్ 13 (ఒక ఫోర్), అక్షర్ పటేల్ 9, షమీ 5, మయాంక్ అగర్వాల్ 4, రవీంద్ర జడేజా 4 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దేనియా, జయవిక్రమ మూడేసి వికెట్లు, డిసిల్వా 2, లక్మల్ ఒక వికెట్ తీశారు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. వరుసగా మూడు, ఐదో ఓవర్లలో తొలి బంతికే వికెట్లు తీశాడు. కుశాల్ మెండీస్ (2), లహిరు తిరిమానేను (8) బుమ్రా ఫెమిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ కరుణరత్నే (4)ను షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో శ్రీలంక 14 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయింది.
కాసేపటి తర్వాత షమీ మరోసారి చెలరేగడంతో జట్టు స్కోర్ 28 పరుగుల వద్ద ఉండగా డిసిల్వా(10) ఎల్బీడబ్ల్యూలో ఫెమిలియన్ చేర్చాడు. ఆ వెంటనే 5 పరుగులు చేసిన చరిత అసలంక.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రవిచంద్రన్ అశ్విన్‌కు దొరికిపోయాడు. దీంతో శ్రీలంక 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో డిక్విల్లాతో కలిసి మాథ్యూస్ శ్రీలంకను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మరికాసేపట్లో తొలి రోజు ఆట ముగుస్తుందనే సమయంలో 43 పరుగులతో క్రీజులో కుదురుకున్న మాథ్యుస్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. మాథ్యూస్ ఆడిన ఆ బంతి రోహిత్ శర్మ చేతిలోకి క్యాచ్‌గా వెళ్లింది. అది హిట్‌మ్యాన్ ఒడిసి పట్టుకోవడంతో మాథ్యూస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడడంతో శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో డిక్వెల్లా (13), ఎంబుల్దేనియా ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3, షమీ 2, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. శ్రీలంక ఇంకా 166 పరుగులు వెనుకబడి ఉంది.