India vs Sri Lanka: చెలరేగిన కరుణరత్నే, షనకా.. టీమిండియాకి భారీ టార్గెట్!!

కొలంబో: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసి.. యువ టీమిండియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇన్నింగ్స్ చివర్లో చమికా కరుణరత్నె(43 నాటౌట్; 35 బంతుల్లో 1x4, 2x6) ధాటిగా ఆడి లంక జట్టుకు పోరాడే స్కోర్ అందించాడు. అవిష్కా ఫెర్నాండో (32), మినోద్ భానుక (27), చరిత అసలంక (38), కెప్టెన్ దాసన్ షనకా (39) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్ తలో వికెట్ పడగొట్టారు. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 9 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయలేదు.
తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. లంక ఓపెనర్లు అవిష్కా ఫెర్నాండో (32; 35 బంతుల్లో 2x4, 1x6), మినోద్ భానుక (27; 44 బంతుల్లో 3x4) ఆచితూచి ఆడారు. భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్‌లను సమర్ధవంతంగా ఎదుర్కొని మంచి ఆరంభం ఇచ్చారు. అయితే స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ వేసిన 10వ ఓవర్ తొలి బంతికి ఫెర్నాండో ఔటయ్యాడు. కవర్స్ మీదుగా షాట్ ఆడబోయిన ఫెర్నాండో.. మనీష్ పాండేకు నేరుగా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అది చహల్ తొలి ఓవర్ కాగా.. వేసిన తొలి బంతికే వికెట్ తీయడం విశేషం. 10 ఓవర్లు ముగిసేసరికి లంక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.
ఆపై మినోద్ భానుక, భనుక రాజపక్స (24; 22 బంతుల్లో 2x4, 2x6) లంక ఇన్నింగ్స్‌ను ముందుకునడిపారు. అయితే కుల్దీప్ యాదవ్ వెంటవెంటనే రెండు వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్ తొలి బంతికి రాజపక్సా పెవిలియన్‌కు చేరాడు. మిడాన్‌లో శిఖర్ ధావన్ క్యాచ్ పట్టడంతో రాజపక్సా ఔటయ్యాడు. అనంతరం భానుకా కూడా పెవిలియన్ బాట పట్టాడు. కుల్దీప్ వేసిన అదే ఓవర్ నాల్గో బంతికి మినోద్ స్లిప్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో లంకేయులు 89 పరుగులు వద్ద మూడో వికెట్‌ను నష్టపోయారు.
తర్వాత ధనుంజయ డి సిల్వను (14) కృనాల్ పాండ్యా బోల్తా కొట్టించాడు. అప్పటికి లంక స్కోర్ 25 ఓవర్లకు 117/4. ఆ తర్వాత జోడీ కట్టిన అసలంక (38; 65 బంతుల్లో 1x4), షనకా ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అనంతరం వారు పరుగుల వేగం పెంచే క్రమంలో స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అసలంకను దీపక్ చహర్ పెవిలియన్ పంపగా.. షనకను చహల్ ఔట్ చేశాడు. అనంతరం భారత బౌలర్లు పట్టు కోల్పోవడంతో టెయిలెండర్లు ధాటిగా ఆడారు. దాంతో భారత్ లక్ష్యం 263 పరుగులుగా నమోదైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications