శ్రీలంకతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ఎంపికైన భారత జట్టుపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ గౌతమ్ గంభీర్ కొందరి ప్లేయర్లకు అన్యాయం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరుగుల వరద పారిస్తూ ఆకట్టుకుంటున్న అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్‌ను తప్పించడంపై మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జులై 27 నుంచి మొదలుకానున్న లంక సిరీస్‌కు లెఫ్ట్-రైట్ బ్యాటర్ల కాంబినేషన్‌తో ఓపెనర్లను బరిలోకి దించాలని సెలక్టర్లు-కోచ్ భావించి యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశారు. అంతేగాక గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రమోట్ చేశారు. అయితే గణాంకాల పరంగా జైస్వాల్-గిల్ కంటే జైస్వాల్-అభిషేక్ జోడీనే హిట్ కాంబినేషన్‌గా పేరుంది.మాధ్యూ హెడెన్-గిల్ క్రిస్ట్ హిట్ జోడీలా ఈ ఇద్దరూ ఎడమచేతి వాటం విధ్వంసకర్ల బ్యాటర్లు.

వారిద్దరిని టీమిండియా ఓపెనర్లుగా పంపిస్తే భారీ స్కోర్లు సాధించడం ఖాయం. కానీ గిల్‌ను జట్టులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అభిషేక్‌కు మొండిచేయి చూపించారని తెలుస్తోంది. గణాంకాల్లోనూ గిల్ కంటే అభిషేక్ మెరుగ్గా ఉన్నాడు. గతేడాది నుంచి గిల్ టీ20 గణాంకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 2023 నుంచి అహ్మదాబాద్ వేదికపై మినహా మిగిలిన వేదికల్లో గిల్ తేలిపోతున్నాడు. అహ్మదాబాద్‌లో గిల్ 16 మ్యాచ్‌ల్లో 75 సగటుతో 982 పరుగులు చేశాడు. నాలుగు అర్ధశతకాలు, నాలుగు శతకాలు బాదాడు. అత్యధిక స్కోరు 129.
కానీ మిగిలిన వేదికల్లో గిల్ ఆడిన 32 మ్యాచ్‌ల్లో 27 సగటుతో 839 పరుగులే చేశాడు. ఓ సెంచరీ, అయిదు హాఫ్ సెంచరీలు సాధించాడు. దీంతో ఫ్లాట్ పిచ్‌పై మాత్రమే గిల్ ఆడతాడని, మిగిలిన వికెట్లపై తడబడతాడనే విమర్శ అతనిపై ఉంది. ఓవరాల్‌గా 2023 నుంచి గిల్ 42 సగటు, 149 స్ట్రైక్ రేటుతో 1821 పరుగులు చేశాడు. ఇక గిల్ బౌండరీ సామర్థ్యాన్ని పరిశీలిస్తే.. 17 బంతులకు గిల్ ఓ సిక్సర్, 5 బంతులకు ఓ ఫోర్ చొప్పున బాదాడు.
మరోవైపు అభిషేక్ మాత్రం మాస్ హిట్టర్‌గా పేరుపొందాడు. 41 ఇన్నింగ్స్‌ల్లో 32 సగటు, 183 స్ట్రైక్‌రేటుతో 1821 పరుగులు చేశాడు. ఈ సన్‌రైజర్స్ బ్యాటర్ తాను ఎదుర్కొన్న 7 బంతులకు కనీసం ఓ సిక్సర్, మూడు బంతులకు కనీసం ఓ బౌండరీ సాధిస్తున్నాడు. ఇక జట్టులో ఎంపికైన జైస్వాల్ 14 బంతులకు ఓ సిక్సర్, 3 బంతులకు ఓ బౌండరీ సగటును బాదుతున్నాడు. అంతేగాక జింబాబ్వే పర్యటనలో సెంచరీతో కదం తొక్కాడు. కానీ జట్టులో చోటు కోల్పోయాడు.