
ధర్మశాల: శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వేసిన తొమ్మిదో ఓవర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఓవర్ మొదటి మూడు బంతులకు రవీంద్ర జడేజా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి మూడు బంతుల్లో శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలక భారీగా పరుగులు రాబట్టాడు. మొదటి బంతిని సిక్సు బాదిన గుణతిలక, రెండో బంతిని ఫోర్ బాదాడు. ఇక మూడో బంతిని సిక్సు బాదాడు. ఇలా జడేజా వేసిన తొమ్మిదో ఓవర్‌లో తొలి మూడు బంతుల్లోనే గుణతిలక ఏకంగా 16 పరుగులు రాబట్టాడు. తర్వాతి 3 బంతుల్లో కూడా అదే జోరులో పరుగులు రాబట్టేలా కనిపించాడు.
కానీ ఈ క్రమంలో రవీంద్ర జడేజాకు కెప్టెన్ రోహిత్ శర్మ విలువైన సూచనలు చేశాడు. రోహిత్ సూచనలకు తోడు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి జడేజా తొమ్మిదో ఓవర్ నాలుగో బంతిని వేశాడు. తొలి మూడు బంతుల మాదిరిగానే గుణతిలక ఆ బంతిని కూడా భారీ షాట్ ఆడాడు. దీంతో మిడ్ ఆన్ మీదుగా బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున వెంకటేశ్ అయ్యర్ వేగంగా ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి కాస్త డైవ్ చేసి మరి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో గుణతిలక దూకుడుకు బ్రేక్ పడింది. 29 బంతుల్లో 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అంతేకాకుండా శ్రీలంక ఓపెనర్ల హాఫ్ సెంచరీ భాగస్వామ్మాన్ని జడేజా విడదీశాడు. భారత్‌కు తొలి వికెట్ లభించింది. గుణతిలక ఔట్‌తో శ్రీలంక 8.4 ఓవర్లలో 67 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దీంతో రవీంద్ర జడేజా పుంజుకున్న విధానంపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.
బరిలోకి దిగిన ఇరు జట్లు
శ్రీలంక:
పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.