
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండోరోజైన ఆదివారం శ్రీలంక క్రికెటర్లు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం నిజమని ఆ జట్టు కోచ్ నిక్ పాథస్ సృష్టం చేశాడు. జట్టులోని ఆటగాళ్లు సురంగ లక్మల్, లాహిరు గమాగె, ధనంజయ డిసిల్వా వాంతులు చేసుకున్నారని వెల్లడించారు.
రెండో రోజు మ్యాచ్ అనంతరం ఆ జట్టు కోచ్ నిక్ పాథస్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ టెస్టులో కావాలనే లంక క్రికెటర్లు నాటకీయ పరిణామాలను తెరలేపారన్న వాదనను ఆయన ఖండించారు. ఢిల్లీ టెస్టులో ఆటగాళ్ల ఆరోగ్యం గురించి జట్టు మేనేజ్‌మెంట్ తీవ్రంగా ఆలోచిస్తుందని ఆయన తెలిపారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు సైతం ఉన్నాయని అన్నారు.

'మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒకానొక దశలో ఆటగాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఫీల్డ్‌ను విడిచి పెట్టి డ్రెస్సింగ్ రూమ్‌కు రాగానే వాంతులు చేసుకున్నారు. అంతేకాదు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు సైతం ఉన్నాయి. ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు ఈ తరహాలో ఇబ్బంది పడటం చిన్న విషయం కాదు' అని అన్నారు.

డ్రెస్సింగ్ రూమ్‌లో లక్మల్ విరామం లేకుండా చాలాసేపు వాంతులు చేసుకున్నాడు. దీనికి కారణం చుట్టు అలుముకున్న పొగ కాలుష్యమే. మ్యాచ్ రిఫరీ, డాక్టర్లు వచ్చి పరిస్థితి సమీక్షించారు. మా దృష్టిలో ఇది చాలా ప్రత్యేకమైన కేసు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేం క్రికెట్ ఆడాలి. ఆడాలనే అనుకుంటాం. అయితే మా ఆటగాళ్ల భద్రతపై స్పష్టత కోరుతున్నాం' అని పేర్కొన్నారు.
'ఫీల్డింగ్ చేసేందుకు 10 మంది సైతం మైదానంలో లేని స్థితిని కెప్టెన్ దినేశ్ చండిమాల్ నాకు వివరించాడు. అప్పుడు మేం ఏం చేస్తున్నామో అంపైర్లకు తెలుసు. పరిస్థితీ సంక్లిష్టంగానే ఉంది. ఇక మిగిలిన రోజుల మ్యాచ్ ఏమిటనేది రిఫరీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ మళ్లీ ఇదే తరహా పరిస్థితి ఏర్పడితే రిఫరీనే నిర్ణయం తీసుకుంటాడు' పాథస్ అన్నారు.