India vs Sri Lanka 3rd T20I: హాఫ్ సెంచరీతో ఆదుకున్న దసున్ శనక.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం

ధర్మశాల: 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడిన శ్రీలంకను ఆ జట్టు కెప్టెన్ దసున్ శనక అద్భుతంగా ఆడి అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్ల ముగిసే సమయానికి శ్రీలంక 5 వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది. భారత్ ముందు 147 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక టాపార్డర్ పూర్తిగా విఫలమైన చోట శనక కెరీర్ బెస్ట్ ఫర్‌ఫామెన్స్‌తో లంక పాలిట ఆపద్భాందవుడి అవతారం ఆడాడు. మొత్తంగా 38 బంతుల్లో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

తొలి ఓవర్‌లోనే దెబ్బ కొట్టిన సిరాజ్
శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన లంక బ్యాటర్లను భారత ఓపెనింగ్ బౌలర్లు సిరాజ్, అవేష్ ఖాన్ పవర్‌ప్లేలో వణికించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే సిరాజ్ వికెట్ తీసి శ్రీలంకను దెబ్బకొట్టాడు. సిరాజ్ ధాటికి శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలక డకౌట్ అయ్యాడు. సిరాజ్ విసిరిన బంతిని ఆడడంలో విఫలమైన గుణతిలక బౌల్డ్ అయ్యాడు. 140 కిలో మీటర్ల వేగంతో వచ్చిన బంతి బ్యాట్‌కు తాకి మరీ వికెట్లను గిరాటేసింది. దీంతో శ్రీలంక ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది.

పవర్‌ప్లేలో కట్టడి
ఆ తర్వాత రెండో ఓవర్ వేసిన అవేష్ ఖాన్ కూడా లంకేయులను దెబ్బకొట్టాడు. గత మ్యాచ్‌లో 75 పరుగులతో చెలరేగిన శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంకను ఒక్క పరుగుకే ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో అవేష్ ఖాన్ మరోసారి విజృంభించాడు. వన్‌డౌన్ బ్యాటర్ చరిత అసలంకను 4 పరుగులకే ఫెమిలిమయన్ చేర్చాడు. దీంతో శ్రీలంక 11 పరుగులకే 3 టాప్ వికెట్లను కోల్పోయింది. పరుగులు కూడా రాకుండా కట్టడి చేయడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 16 పరుగులు మాత్రమే చేసింది.

60 పరుగులకే 5 వికెట్లు
ఆ తర్వాత 19 బంతులాడి 9 పరుగులు మాత్రమే చేసిన జనిత్ లియానగేను రవి బిష్ణోయ్ బోల్డ్ చేశాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ చండీమాల్ కాసేపు భారత బౌలర్లను అడ్డుకున్నాడు. కానీ ఈ సమయంలో 25 పరుగులు చేసిన చండీమాల్‌ను హార్షల్ పటేల్ ఔట్ చేశాడు. అతడు వెంకటేష్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 12.1 ఓవర్లలో 60 పరుగులకే శ్రీలంక 5 వికెట్లు కోల్పోయింది.

ఆదుకున్న శనక
ఈ సమయంలో కెప్టెన్ దసున్ శనక టీ20 కెరీర్లో మూడో హాఫ్ సెంచరీతో శ్రీలంకను ఆదుకున్నాడు. కరుణరత్నేతో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 86 పరుగులు చేశాడు. శనక 74 పరుగులతో, కరుణరత్నే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. శనక ధాటికి చివరి 47 బంతుల్లోనే శ్రీలంకకు 86 పరుగులు వచ్చాయి. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 5 వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అవేష్ ఖాన్ 2, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications