హైదరాబాద్: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ ను 3-0 తో భారత్ కైవసం చేసుకుంది.
భారత్ బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ (124) సెంచరీ చేయగా, శిఖర్ ధావన్ 5, కోహ్లీ 3, కేఎల్ రాహుల్ 17 పరుగులు చేసి అవుటయ్యారు. ధోనీ 67 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో ధనంజయ 2 వికెట్లు తీయగా మలింగ, ఫెర్నాండో చెరో వికెట్ తీసుకున్నారు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:
ఆగిపోయిన మ్యాచ్: గ్రౌండ్‌లోకి బాటిళ్లు విసిరిన శ్రీలంక ఫ్యాన్స్
భారత్‌తో జరుగుతోన్న మూడో వన్డేలోనూ శ్రీలంక జట్టు ఓటమిని ఆ జట్టు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. టీమిండియా లక్ష్యానికి చేరువైన క్రమంలో ప్రేక్షకులు గ్రౌండ్‌లోకి బాటిల్స్ విసిరేశారు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిచే సమయానికి 44 ఓవర్లకు టీమిండియా 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ(122), ధోని (61) పరుగులతో క్రీజులో ఉన్నారు.

గెలుపు ముంగిట టీమిండియా
మూడో వన్డేలో 218 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ(114), మహేంద్రసింగ్ ధోనీ (46)క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి 32 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా 10 ఓవర్లు ఉన్నాయి.

రోహిత్ శర్మ సెంచరీ
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేశాడు. 118 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో సెంచరీని సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు 12వ సెంచరీ. లంక బౌలర్ చమీరా వేసిన 34.6 బంతికి సింగిల్ తీసి రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో ధోని (33) పరుగులతో క్రీజులో ఉన్నాడు.
రోహిత్ అర్ధ సెంచరీ
218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తడబడుతోంది. 61 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు స్పిన్నర్ అఖిల ధనంజయ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శిస్తున్నాడు. జట్టు స్కోరు 61 వద్ద కేఎల్ రాహుల్ (17), కేదార్ జాదవ్ (0)ను పెవిలియన్ పంపించాడు. రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 66 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 10 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో ధోనీ (3) ఉన్నాడు. 21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (34) నిలకడగా ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత కేదార్ జాదవ్ క్రీజులోకి వచ్చాడు. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది.
పది ఓవర్లకు భారత్ 35/2
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో పది ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 21, లోకేశ్ రాహుల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే ధావన్, కోహ్లీ వికెట్లు కోల్పోయింది.
3 పరుగులకే కోహ్లీ అవుట్
జట్టు స్కోరు 19 పరుగుల వద్ద కెప్టెన్ కోహ్లీ (3) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఫెర్నాండో వేసిన ఆరో ఓవర్ తొలి బంతిని షాట్ కొట్టేందుకు యత్నించిన కోహ్లీ.. చమీరా చేతికి చిక్కాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 19 పరుగుల చేసింది. రోహిత్ శర్మ(10), లోకేశ్ రాహుల్ (0) క్రీజులో ఉన్నారు.
ఓపెనర్ ధావన్ అవుట్
218 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ శిఖర్ ధావన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 4, కెప్టెన్ కోహ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
భారత్ విజయ లక్ష్యం 218
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక భారత బౌలర్ల ధాటికి నిలకబడలేకపోయింది. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 218 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
శ్రీలంక బ్యాట్స్‌మన్‌లలో తిరిమన్నే ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 105 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్స్‌తో 80 పరుగులు చేశాడు. ఓపెనర్ చండీమాల్ 36, సిరివర్దన 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వారందరూ ఘోరంగా విఫలమయ్యారు.
డిక్‌వెల్లా 13, మెండిస్ 1, మాధ్యూస్ 11, కెప్టెన్ కపుగెదెర 14, దనంజయ 2, చమీర 6, ఫెర్నాండో 5 (నాటౌట్), లసిత్ మలింగ 1(నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి లంకను దెబ్బతీశాడు. పాండ్యా, అక్షర్ పటేల్, కేదార్ జాదవ్‌లు తలో వికెట్ తీసుకున్నారు.
శ్రీలంక బ్యాటింగ్ తీరు సాగిందిలా:
మూడో వన్డేకి వర్షం అడ్డంకి: శ్రీలంక 192/7
మూడో వన్డే శ్రీలంకకు వరుణుడు అంతరాయం కలిగించాడు. క్యాండీలో వర్షం కారణంగా శ్రీలంక ఇన్నింగ్స్ 47 ఓవర్ల దగ్గర ఆట నిలిచిపోయింది. ఆ సమయానికి లంక 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. తిరిమానె (80) ఒక్కడే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఓపెనర్ చండీమాల్ 36 పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా మరోసారి 4 వికెట్లు తీయగా.. పాండ్యా, అక్షర్ పటేల్, కేదార్ జాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.
45 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 190/6
భారత్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక 181 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 45 ఓవర్లు ముగిసే సరికి లంక ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మన్‌లలో లహిరు తిరిమన్నె 80 పరుగులు చేశాడు. ప్రస్తుతం సిరివర్దన (20) ధనంజయ (2) క్రీజులో ఉన్నారు.
తిరిమన్నె హాఫ్ సెంచరీ
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక బ్యాట్స్‌మన్ లాహిరు తిరిమన్నె 69 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తొలుత కాస్త తడబడ్డ తిరిమన్నె ఆ తర్వాత కుదురుకున్నాడు. చక్కని షాట్లతో అలరిస్తున్నాడు. 11 పరుగుల వ్కక్తిగత స్కోరు వద్ద మాథ్యూస్ అవుట్ కావడంతో నాలుగో వికెట్ రూపంలో చేజార్చుకుంది. 38 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 138 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. కేదార్ జాదవ్ బౌలింగ్‌లో మాథ్యూస్ (11) ఎల్బీ అయ్యాడు. మరోవైపు రెండో డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన తిరిమన్నె నిలకడగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 36 ఓవర్లు ముగిసే సరికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో జట్టు స్కోరుని ముందుండి నడిపించిన చండీమల్ (36)ను హార్ధిక్ పాండ్యా పెవిలియన్ పంపాడు. పాండ్యా వేసిన 25.4వ బంతిని చండిమాల్ భారీ షాట్ ఆడాడు. టాప్ ఎడ్జ్ అయి గాల్లోకి లేచిన బంతిని మిడ్‌వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా చక్కగా ఒడిసిపట్టాడు. దీంతో తిరుమన్నెతో కలిసి చేసిన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం 27 ఓవర్లు ముగిసే సరికి లంక 3 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మ్యాథ్యూస్ 0, తిరిమన్నే (42) పరుగులతో ఉన్నారు.
50 పరుగుల దాటిన భాగస్వామ్యం
భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్ దినేశ్ చండిమాల్ (28), లాహిరు తిరుమన్నె (29) ఆచితూచి ఆడుతున్నారు. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన తిరుమన్నేతో కలిసి చండీమల్ ఆచితూచి ఆడుతున్నాడు. దీంతో వీరిద్దరి భాగస్వామ్యం 50 పరుగులు దాటింది. 21 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం చండీమల్ (29), తిరిమన్నే (31) క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక రెండో వికెట్ చేజార్చుకుంది. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కుశాల్ మెండిస్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసే సరికి లంక రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. మెండీస్ పది బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు చేశాడు.చండీమల్ (10), తిరుమన్నే (1) పరుగుతో క్రీజులో ఉన్నారు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా రెండు మెయిడెన్లు వేసి 8 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

తొలి వికెట్ తీసిన బుమ్రా
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.బుమ్రా వేసిన బంతికి ఓపెనర్ డిక్‌వెల్లా(13) ఎల్బీగా అవుటయ్యాడు. ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. చండీమల్ (4), కుశాల్ మెండిస్ (0) క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య 3వ వన్డే ప్రారంభమైంది. పల్లెకెలె వేదికగా జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పర్యటనలో శ్రీలంక టాస్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. లంక జట్టు కెప్టెన్ ఉపుల్ తరంగ గాయపడటంతో అతడి స్ధానంలో కెప్టెన్‌గా కపుగెదెర వ్యవహరిస్తున్నాడు.
రెండో వన్డేలో స్లోఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు వన్డేల సస్పెన్షన్ వేటు పడింది. అది తక్షణం అమల్లోకి రావడంతో అతడి స్థానంలో కపుగెదర కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
'రెండో వన్డేలో చాలా బాగా ఆడాం, కానీ విజయానికి ఆవలే నిలిచిపోయాం. అది గతం. ప్రస్తుత మ్యాచ్‌లు అన్ని రకాలుగా సిద్ధమయ్యాం. ఉపల్ ఎలాగు లేడు కాబట్టి తిరమన్నే జట్టులోకి వచ్చాడు. గుణతిలకకు గాయం కావడంతో అతని స్థానంలో చండిమాల్ ఆడుతున్నాడు' అని టాస్ సందర్భంగా కపుగెదర అన్నాడు.

రెండో వన్డేలో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగుతున్నామని కెప్టెన్ కోహ్లీ అన్నాడు. 'మా ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదు. మొదటి రెండు గేమ్‌లు బాగా ఆడాం. కాకపోతే రెండో వన్డేలో మిడిలార్డర్ కాస్త తడబడింది. అదో మాకో మంచి పాఠం. మేం చాలా రిలాక్స్‌గా ఉన్నాం. దాదాపు మూడు వన్డేలు అడిన ప్లేయర్ మా వెనుక ఉన్నాడు' అని కోహ్లీ అన్నాడు.
'ధోనీకి ఇది 299వ వన్డే. భువీ ప్రశాంతంగా పని కానిస్తున్నాడు. కష్టాల్లో ఎలా ఆడాలో వీరిద్దరూ మాకు చూపించారు. దాన్నే మిగిలిన కుర్రాళ్లు ఫాలో అవుతారు. జట్టులో ఎలాంటి మార్పులు లేవు' అని విరాట్ కోహ్లీ చెప్పాడు. మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన శ్రీలంక వన్డే సిరీస్‌లో ఇప్పటికే 2-0తో వెనుకబడి ఉంది. సిరిస్ కాపాడుకోవాలంటే శ్రీలంక తప్పనిసరిగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంది.
జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్
శ్రీలంక: నిరోషన్ డిక్వెల్లా, లాహిరు తిరిమన్నే, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, మాథ్యూస్, కపుగెదర, సిరివర్దన, అఖిల ధనంజయ, చమీర, విశ్వ ఫెర్నాండో, లసిత్ మలింగ