సర్ఫరాజ్‌కు ఛాన్స్.. కానీ టీమిండియా కాంబినేషన్‌లో బిగ్ ట్విస్ట్!
శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారట జట్టులో కీలక మార్పు జరిగింది. ఇటీవల శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్- ఏ జట్టు తరఫున ఆడుతూ కుడికాలికి గాయం కావడంతో ఓపెనర్ సాయి సుదర్శన్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు. దీంతో సాయి సుదర్శన్ స్థానంలో ముంబై మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 2024లో న్యూజిలాండ్‌పై 150 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన అనంతరం సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ రెండేళ్ల విరామం తర్వాత టెస్ట్ జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే సాయి సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి గల 3 ప్రధాన కారణాలు ఇవే.
సరైన రీప్లేస్‌మెంట్ కాదు..
ఈ ఎంపిక సరైన ప్రత్యామ్నాయం కాదని తెలుస్తోంది. సాయి సుదర్శన్ టాపార్డర్ స్పెషలిస్ట్ బ్యాటర్ కాగా.. ఆయన ఓపెనర్‌గా లేదా మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కొత్త బంతిని ఎదుర్కొని ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయగలడు. కానీ సర్ఫరాజ్ ఖాన్ పూర్తిగా మిడిలార్డర్(5 లేదా 6వ స్థానం) స్పెషలిస్ట్. ఓ టాపార్డర్ బ్యాటర్ గాయపడితే ఆయన స్థానంలో మిడిలార్డర్ ఆటగాడిని తీసుకోవడం వల్ల జట్టులో నేరుగా టాపార్డర్ కవర్ లేకుండా పోతుంది. ఇది తుది జట్టు కూర్పులో ఇతర బ్యాటర్లను తమ క్రమం కూర్చుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేస్తుంది.

బ్యాటింగ్ శైలిలో తేడా
వీరిద్దరి బ్యాటింగ్ శైలిలో స్పష్టమైన తేడా ఉండటంతో పాటు లంక స్పిన్ పిచ్‌లపై ప్రమాదం పొంచి ఉండటం. సాయి సుదర్శన్ క్లాసిక్ టాపార్డర్ డిఫెన్స్, క్రమశిక్షణతో ఆడుతూ క్రీజులో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తాడు. లంకలోని స్పిన్ పిచ్‌లపై కొత్త బంతి తీవ్రత తగ్గడానికి, స్పిన్నర్లను అడ్డుకోవడానికి ఈ శైలి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ సర్ఫరాజ్ ఖాన్ స్పిన్నర్లపై స్వీప్ షాట్లతో విరుచుకుపడే దూకుడు స్వభావం కలిగిన బ్యాటర్ కావడం గమనార్హం. స్వదేశీ పిచ్‌లపై ఇది వర్కవుట్ అయినప్పటికీ.. అంచనా వేయలేని బౌన్స్ ఉండే గాలే పిచ్‌లపై ఇలాంటి హై-రిస్క్ షాట్లు ఆడితే త్వరగా వికెట్ సమర్పించుకునే ప్రమాదం ఉంది.
మిడిలార్డర్‌లో ఇప్పటికే ఉన్న అటాకింగ్ బ్యాటర్లు
టీమిండియా మిడిలార్డర్‌లో ఇప్పటికే రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి కౌంటర్-అటాకింగ్ బ్యాటర్లు ఉన్నారు. వీరు స్పిన్‌పై వేగంగా పరుగులు సాధించగలరు. సాయి సుదర్శన్ జట్టులో ఉంటే సుదీర్ఘ కాలం బ్యాటింగ్ చేస్తూ ఒత్తిడిని తట్టుకునే నిలకడ లభించేది. ఆయన స్థానంలో మరో అటాకింగ్ బ్యాటర్ అయిన సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోవడం వల్ల మిడిలార్డర్‌లో ఒకే రకమైన ఆటగాళ్లు ఎక్కువవుతారు కానీ వ్యూహాత్మక సమతుల్యత దెబ్బతింటుంది.
సర్ఫరాజ్ ఖాన్ కంటే రజత్ పాటిదార్ ఈ స్థానానికి సరైన ఎంపిక అయి ఉండేవారని విశ్లేషకులు భావిస్తున్నారు. రజత్ పాటిదార్ గాలిలోకి షాట్లు ఆడకుండా సింగిల్స్, డ్రైవ్‌లతో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించగలడు. గతేడాది దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున ఫైనల్లో సెంచరీతో సహా 5 మ్యాచ్‌ల్లో 382 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రికార్డు కూడా ఆయన సొంతం. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

