
హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లు ఆడిన టీమిండియా వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్(2), ఛటేశ్వర్ పుజారా(2) ఉన్నారు.
అంతకముందు టాస్ గెలిచిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్ ఐదో బంతికే ఓపెనర్ కేఎల్ రాహుల్(7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 8 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో లంకపై ఆధిక్యం సాధించేందుకు భారత్ ఇంకా 194 పరుగులు చేయాల్సి ఉంది.
శ్రీలంక 205 ఆలౌట్
నాగ్ పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు 205 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఓపెనర్ల నుంచి శుభారంభం దక్కలేదు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణరత్నే (51), చండీమాల్ (57) పరుగులతో రాణించగా, మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇక భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు తీసుకోగా, జడేజా, ఇషాంత్ శర్మ చెర్ 3 వికెట్లు తీసుకున్నారు.
8 వికెట్లు కోల్పోయిన శ్రీలంక
నాగ్ పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీ విరామం అనంతరం భారత బౌలర్లు రెచ్చిపోయారు. టీ విరామానికి 151/4 పరుగులు చేసిన శ్రీలంక ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం శ్రీలంక
ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 72వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్(57) పరుగుల వద్ద ఎల్బీగా ఔటయ్యాడు. 72వ ఓవర్‌లో అశ్విన్ వేసిన బంతిని చండీమాల్ ఎదుర్కొన్నాడు. దీంతో వెంటన్ అశ్విన్ అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే కోహ్లీ.. అశ్విన్‌ను సంప్రదించి రివ్యూ కోరగా, రివ్యూలో చండీమాల్ ఔటనట్లు తేలింది.
చండీమాల్ అవుటైన తర్వాత భారత స్పిన్నర్లు విజృంభించారు. అశ్విన్ బౌలింగ్‌లో శనక(2), జడేజా బౌలింగ్‌లో దిల్రువాన్ పెరీరా(15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో 74 ఓవర్లు ముగిసే సమయానికి లంక 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెరాత్(1), లక్మల్(5) ఉన్నారు. జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీయగా పేసర్ ఇషాంత్ శర్మకు 2 వికెట్లు తీసుకున్నారు.

టీ విరామానికి శ్రీలంక 151/4
నాగ్ పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీ విరామానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఆ తర్వాత నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం దినేశ్ చంఢీమాల్(47), డిక్వెలా(18) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.
హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన కరుణరత్నే
రెండో టెస్టులో లంక నాలుగో వికెట్ కోల్పోయింది. రెండో టెస్టులో మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కరుణరత్నే ఎట్టకేలకు ఔటయ్యాడు. 50.6వ ఓవర్లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఓపెనర్ కరుణరత్నే(51) పరుగుల వద్ద ఎల్బీగా అవుటయ్యాడు. 47వ ఓవర్లో కరుణరత్నే తన టెస్టు కెరీర్‌లో 14వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అలాగే ఈ ఏడాది టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా నిలిచాడు.

లంక తరఫున ఒకే ఏడాదిలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో ఓపెనర్‌గా కరుణరత్నే నిలిచాడు. గతంలో జయసూర్య మాత్రమే శ్రీలంక తరుపున 1997, 2004లో వెయ్యికి పైగా పరుగులు నమోదు చేశాడు. కాగా, చండీమాల్-కరుణరత్నేల జోడీ నాలుగో వికెట్‌కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించింది. ప్రస్తుతం 53 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో చండీమాల్(36), డిక్వెలా(4) ఉన్నారు.
టెస్టుల్లో 3వేల పరుగులు చేసిన చండీమాల్
నాగ్ పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో శ్రీలంక తరుపున 3వేల పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్లోని 4వ బంతికి చండీమాల్ ఫోర్‌గా మలిచాడు. దీంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటడంతో పాటు చండీమాల్ టెస్టుల్లో 3వేల పరుగులు మైలు రాయిని అందుకున్నాడు. 46 ఓవర్లు ముగిసే సమయానికి లంక 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నే(45), చండీమాల్(26) ఉన్నారు.

మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
నాగ్ పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. 47/2తో లంచ్ విరామానికి వెళ్లిన లంక ఆ తర్వాత కాస్త దూకుడు పెంచింది. ఈ క్రమంలో 30వ ఓవర్లో జడేజా వేసిన చివరి బంతికి ఏంజెలో మాథ్యూస్ (10) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 31 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నే(26), చండీమాల్(1) ఉన్నారు.
జడేజా పొరపాటు: ఔట్ నుంచి తప్పించుకున్న కరుణరత్నే
నాగ్ పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్ విరామానికి శ్రీలంక 27 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. ప్రస్తుతం కరుణరత్నె 21, మాథ్యూస్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ప్రమాదకరంగా మారిన కరుణరత్నె-తిరిమన్నె జోడీని అశ్విన్ విడదీశాడు. లంకపై ఒత్తిడి పెంచే క్రమంలో కోహ్లీ.. జడేజాను రంగంలోకి దింపాడు. ఆ ఓవర్ చివరి బంతికి కరుణరత్నేను సాహా స్టంపౌట్ చేశాడు. అయితే అది కాస్తా నోబాల్ అని తేలడంతో కరుణరత్నె బతికిపోయాడు.

క్యాచ్ మిస్ చేసిన పుజారా
నాగ్ పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్ కరుణరత్నే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 18.4 వద్ద కరుణరత్నే తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అశ్విన్ వేసిన బంతిని ఎదుర్కొన్న కరుణరత్నే పరుగు కోసం యత్నించాడు.
ఈ క్రమంలో బంతిని అందుకున్న పుజారా నేరుగా వికెట్లను గిరాటేశాడు. భారత ఆటగాళ్లు ఔట్ అప్పీల్ చేయగా థర్డ్ అంపైర్ రివ్యూలో దానిని నాటౌట్‌గా తేల్చారు. అనంతరం 20.4 వద్ద అశ్విన్ బౌలింగ్‌లోనే మరోసారి కరుణరత్నే ఔట్ నుంచి తప్పించుకున్నాడు. కరుణరత్నే బంతిని గాల్లోకి లేపగా పుజారా క్యాచ్ మిస్ చేశాడు. 22 ఓవర్లు ముగిసే సమయానికి లంక వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నే(19), తిరిమన్నే(5) ఉన్నారు.
తొలి వికెట్ తీసిన ఇషాంత్
నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో ఓపెనర్ సమర విక్రమ(13) పుజారాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆరు ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నే(8), తిరిమన్నే ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. నాగ్ పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ ఎంచుకుంది.
శ్రీలంక ఎలాంటి మార్పులు లేకుండా తొలి టెస్టు ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. మరోవైపు టీమిండియా మాత్రం మూడు మార్పులు చేసింది. ధావన్ స్థానంలో మురళీ విజయ్, భువీ స్థానంలో రోహిత్ శర్మ, షమి స్థానంలో ఇషాంత్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈడెన్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.