
హైదరాబాద్: రెండో టీ20లో భారత బౌలర్లు సత్తా చాటడంతో శ్రీలంక జట్టుని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 143 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లతో చెలరేగాడు. మరోవైపు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలు వరుస విరామాల్లో వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు తీయగా... కుల్దీప్, సైనీలు చెరో రెండు... బుమ్రా, సుందర్‌లు తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 82/3తో పటిష్టంగా కనిపించిన శ్రీలంకను భారత బౌలర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ధనుష్క గుణతిలక(20), ఆవిష్క ఫెర్నాండో(22), కుశాల్ పెరీరా(34) భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యారు.
ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. స్పిన్నర్లు, పేసర్లు తమకు అందివచ్చిన అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్నారు. యువ పేసర్ శార్దుల్ ఠాకూర్ మూడు వికెట్లతో చెలరేగాడు. బౌలర్లు అందరూ అద్భుత ప్రదర్శన చేయడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 142 పరుగుల వద్ద ముగిసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
అంతకముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ స్టేడియంలో ఛేజింగ్ తేలిక కాబట్టి ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. తుది జట్టులో ఎలాంటి మార్పు లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా గువహటి వేదికగా ఆదివారం జరగాల్సిన తొలి టీ20 ఒక్క బంతి కూడా పడకుండా వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
హోల్కర్ స్టేడియంలో డిసెంబర్ 22, 2017లో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో లంకపై టీమిండియా 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. గాయం కారణంగా గత కొంతకాలంగా ప్రపంచ క్రికెట్‌కు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. బుమ్రాతో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేశాడు.
మరో ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్‌తో కలిసి శిఖర్ ధావన్ ఓపెనింగ్‌ను ఆరంభించనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత శ్రీలంక మాజీ సారథి ఏంజెలో మాథ్యూస్ మళ్ళీ టీ20 క్రికెట్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ ఏడాదిని విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి.
రెండో టీ20 జరుగుతున్న హోల్కర్ స్టేడియంలో టీమిండియాకు తిరుగులేని రికార్డు ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు భారత క్రికెట్ జట్టు ఆడిన ఎనిమిది అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో(2 టెస్టులు, ఒక టీ20, 5 వన్డేలు) టీమిండియాదే విజయం కావడం విశేషం.