
హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ స్టేడియంలో ఛేజింగ్ తేలిక కాబట్టి ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కోహ్లీ తెలిపాడు.
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా గువహటి వేదికగా ఆదివారం జరగాల్సిన తొలి టీ20 ఒక్క బంతి కూడా పడకుండా వర్షం కారణంగా రద్దు కావడంతో తుది జట్టులో ఎలాంటి మార్పు లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. హోల్కర్ స్టేడియంలో డిసెంబర్ 22, 2017లో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో లంకపై టీమిండియా 22 పరుగుల తేడాతో విజయం సాధించింది.
గాయం కారణంగా గత కొంతకాలంగా ప్రపంచ క్రికెట్‌కు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. బుమ్రాతో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేస్తున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్‌తో కలిసి శిఖర్ ధావన్ ఓపెనింగ్‌ను ఆరంభించనున్నాడు.
సుదీర్ఘ విరామం తర్వాత శ్రీలంక మాజీ సారథి ఏంజెలో మాథ్యూస్ మళ్ళీ టీ20 క్రికెట్ ఆడుతున్నాడు. దీంతో శ్రీలంక జట్టు అతడిపై ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ ఏడాదిని విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. రెండో టీ20 జరుగుతున్న హోల్కర్ స్టేడియంలో టీమిండియాకు తిరుగులేని రికార్డు ఉంది.
ఈ స్టేడియంలో ఇప్పటివరకు భారత క్రికెట్ జట్టు ఆడిన ఎనిమిది అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో(2 టెస్టులు, ఒక టీ20, 5 వన్డేలు) టీమిండియాదే విజయం కావడం విశేషం.
జట్ల వివరాలు:
భారత్: ధావన్, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్, బుమ్రా, నవ్‌దీప్ సైనీ.
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, గుణతిలక, కుశాల్ పెరీర, ఒషాడ ఫెర్నాండో, రాజపక్స, ధనంజయ డిసిల్వ, షనక, ఉదాన, హసరంగ, లాహిరు కుమార, మలింగ (కెప్టెన్).