
హైదరాబాద్: ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 విజయ లక్ష్యాన్ని టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఇరు జట్ల మధ్య మూడో టీ20 శుక్రవారం పూణె వేదికగా జరగనుంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్(45; 32 బంతుల్లో 6 పోర్లు), శిఖర్ ధావన్(32; 29 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభం చేసి తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు.
వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనా శ్రేయస్ అయ్యర్(34; 26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), కెప్టెన్ కోహ్లీ(30; 17 బంతుల్లో ఫోర్, 2 సిక్సులు)తో టీమిండియాకు విజయాన్ని అందించారు. భారత్ విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా అయ్యర్(34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌గా ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌తో కలిసి కెప్టెన్ కోహ్లీ మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించారు. కోహ్లి( 30 నాటౌట్; 17 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్) సిక్స్ కొట్టడంతో 17.3 ఓవర్‌లోనే టీమిండియా విజయం సాధించింది.
టీమిండియా విజయ లక్ష్యం 143
అంతకముందు భారత బౌలర్లు సత్తా చాటడంతో శ్రీలంక జట్టుని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 143 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లతో చెలరేగాడు. మరోవైపు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలు వరుస విరామాల్లో వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు తీయగా... కుల్దీప్, సైనీలు చెరో రెండు... బుమ్రా, సుందర్‌లు తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 82/3తో పటిష్టంగా కనిపించిన శ్రీలంకను భారత బౌలర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ధనుష్క గుణతిలక(20), ఆవిష్క ఫెర్నాండో(22), కుశాల్ పెరీరా(34) భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యారు.
ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. స్పిన్నర్లు, పేసర్లు తమకు అందివచ్చిన అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్నారు. యువ పేసర్ శార్దుల్ ఠాకూర్ మూడు వికెట్లతో చెలరేగాడు. బౌలర్లు అందరూ అద్భుత ప్రదర్శన చేయడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 142 పరుగుల వద్ద ముగిసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
అంతకముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ స్టేడియంలో ఛేజింగ్ తేలిక కాబట్టి ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. తుది జట్టులో ఎలాంటి మార్పు లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా గువహటి వేదికగా ఆదివారం జరగాల్సిన తొలి టీ20 ఒక్క బంతి కూడా పడకుండా వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
హోల్కర్ స్టేడియంలో డిసెంబర్ 22, 2017లో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో లంకపై టీమిండియా 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. గాయం కారణంగా గత కొంతకాలంగా ప్రపంచ క్రికెట్‌కు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. బుమ్రాతో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేశాడు.