
లండన్: ఇది చాలా అరుదుగా కనిపించే సంఘటన. ఒక టీమిండియా ఆడుతుంటే.. మరో టీమిండియా మ్యాచును చూస్తూ ఎంజాయ్ చేసింది. భారత్-శ్రీలంక జట్ల మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఆసాంతం ఆసక్తిగా సాగగా.. అభిమానులతో పాటు టీమిండియా సీనియర్ ప్లేయర్స్ కూడా టీవీలకు అతుక్కుపోయారు. చివరికి వాళ్ల విజయాన్ని వీళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకేసారి అటు ఇంగ్లండ్‌లో ఒక టీమిండియా.. ఇటు శ్రీలంకలో మరో టీమిండియా మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే.
మంగళవారం విరాట్ కోహ్లీ సారథ్యంలోని సీనియర్ టీమిండియా ఇంగ్లండ్‌లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంటే.. ఇటు శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని యువ టీమిండియా శ్రీలంకతో రెండో వన్డే ఆడింది. ప్రాక్టీస్ అనంతరం టీమిండియా సీనియర్ జట్టులోని విరాట్ కోహ్లి, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, కోచ్ రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూమ్ నుంచి భారత్, లంక వన్డే మ్యాచ్‌ను ఆస్వాదించారు. మిగతా ఆటగాళ్లు కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడినుంచే మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్ చేశారు. చివర్లో దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్ జోడీ ఊహించని విజయాన్ని అందించడంతో ఇంగ్లండ్‌లోని కోహ్లీసేన ఈ గెలుపును సెలబ్రేట్ చేసుకుంది.
ఆర్ అశ్విన్, చేతేశ్వర్ పుజారాలు బస్సులో వెళ్తూ.. టీమిండియా మ్యాచ్ గెలిచిందనగానే హైఫై ఇచ్చుకున్నారు. మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, హనుమ విహారి మ్యాచును బాగా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్ చేసింది. మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీమిండియా యువ జట్టును ట్విటర్ ద్వారా అభినందించారు. అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, చేతేశ్వర్ పుజారా తదితరులు టీమిండియాకు అభినందనలు తెలిపారు.
టీమిండియా సీనియర్ జట్టు, ఇంగ్లండ్‌ల మధ్య ఆగస్టు 4 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. మరోపక్క మంగళవారం ప్రారంభం అయిన కౌంటీ ఎలెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ కోహ్లీసేన జోరు ప్రదర్శిస్తుంది. కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. కాగా అతని గైర్హాజరీలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ, రహానే, అశ్విన్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు.