హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేనకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అనూహ్యంగా శ్రీలంక సిరిస్ నుంచి తప్పుకున్నాడు. ఈమేరకు శనివారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
తన తల్లి ఆరోగ్యం సరిగ్గా లేనందున చూడటానికి ధావన్ భారత్‌కు వస్తున్నట్లు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి శనివారం పేర్కొన్నాడు. దీంతో ఆదివారం జరిగే ఐదో వన్డేతో పాటు సెప్టెంబర్ 6న జరగున్న ఏకైక టీ20 మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని ప్రకటించింది.

దీంతో పాటు ఈ సిరిస్‌లో ఆఖరి వన్డేతోపాటు, టీ20 మ్యాచ్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలినే నిర్ణయాన్ని బీసీసీఐ ఉపసంహరించుకుంది. ఈ రెండు మ్యాచ్‌లకు సీనియర్ ఆటగాళ్ల జాబితాలో ఎటువంటి మార్పులు లేవని బీసీసీఐ శనివారం ప్రకటించింది.
దీనిపై కోహ్లీ మాట్లాడుతూ 'శిఖర్ చాలా ప్రతిభావంతుడైన ఆటగాడు. మంచి ఆటతీరుతో ఛాంపియన్ ట్రోఫీలో గోల్డెన్ బ్యాట్‌తో పాటు రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిపించాడు. ధావన్ చాలా ప్రభావిత ఆటగాడని మాకు తెలుసు. రహానే ఆస్థానాన్ని భర్తీ చేస్తాడని ఆకాంక్షిస్తున్నాం' అని అన్నాడు.
అర్థాంతరంగా సిరీస్ నుంచి వెనుదిరిగిన శిఖర్ ధావన్ స్థానంలో సెలెక్షన్ కమిటీ రిజర్వ్‌గా ఎవరిని ఎంపిక చేయలేదు. ఇప్పటికే రహానే, రాహుల్ రూపంలో ఓపెనర్లు ఉన్నందున మరెవరిని తీసుకోలేదు. చివరి రెండు మ్యాచ్‌లకు రహానే, రోహిత్ శర్మతో కలిపి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్, శ్రీలంకపై 4-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.