హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య గురువారం పల్లెకెలె వేదికగా రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డేకి ముందు ఇరు జట్లు జాతీయ గీతాలాపన చేయకుండానే మ్యాచ్‌కి సిద్ధమయ్యాయి.
సాధారణంగా ప్రతీ మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు దేశాలకు చెందిన జట్లు జాతీయ గీతాలాపన చేసిన తర్వాతే మైదానంలోకి అడుగుపెడతాయి. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల సిరిస్‌లో ఒక్క మ్యాచ్‌కి మాత్రమే జాతీయ గీతాలాపన పరిమితమైంది.

కేవలం సిరీస్ ఆరంభపు మ్యాచ్‌కు మాత్రమే జాతీయ గీతాలాపన ఉండాలంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీంతో స్వదేశంలో మ్యాచ్‌లు జరిగేటప్పుడు ఆరంభ మ్యాచ్‌లో మాత్రమే జాతీయ గీతాలాపన ఉంటుందని ఆ దేశ క్రికెట్ మీడియా మేనేజర్ దినేశ్ రత్నసింఘం తెలిపారు.
ఈ నేపథ్యంలో దంబుల్లా వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇరు జట్లు జాతీయ గీతాలాపన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరిస్‌లో మిగతా నాలుగు వన్డేల్లో జాతీయ గీతాలాపన ఉండదని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 6న ప్రేమదాస స్టేడియంలో జరిగే ఏకైక టీ20లో మాత్రమే ఇరు జట్లు జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొంటాయని అన్నారు.