హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్‌లో మరో కీలక మైలురాయికి చేరువయ్యాడు. ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం ధోని శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 296 వన్డేలు ఆడిన ధోని మరో నాలుగు వన్డే మ్యాచ్‌లాడితే 300 వన్డేల క్లబ్‌లో చోటు దక్కించుకుంటాడు.
భారత్ తరుపున ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 19 మంది ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. 296 వన్డేల్లో 9,496 పరుగులు చేసిన ధోని ప్రస్తుత యావరేజి 51.32గా ఉంది.

ఆ తర్వాతి నాలుగు వన్డేల్లో ధోని ఒక్క పరుగూ చేయకపోయినప్పటికీ ధోని యావరేజి 50.24గా ఉంటుంది. దీంతో 300 మ్యాచ్‌లు ఆడిన తర్వాత కూడా వన్డేల్లో 50కి పైగా యావరేజి కలిగి ఉన్న ఏకైక క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనియే కావడం విశేషం. ఐదు వన్డేల సిరిస్ కోసం దంబుల్లా చేరుకున్న ధోని ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
దాదాపు నెల రోజులుగా క్రికెట్ దూరంగా ఉన్న ధోని గురువారం దంబుల్లాలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డా, ఆ తర్వాత తన సహజ శైలిలో షాట్‌లు ఆడాడు. ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ కావడంతో టెస్టు సిరీస్ ఆడిన ఆటగాళ్లెవరూ ప్రాక్టీస్‌కు రాలేదు.
కేదార్ జాదవ్, మనీష్ పాండే, శార్దుల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, బుమ్రాతో కలిసి ధోనితో ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్‌లో భాగంగా బ్యాటింగ్ చేసిన ధోని భారత బౌలర్లతో పాటు స్థానిక లంక బౌలర్లను ఎదుర్కొన్నాడు. కాగా, ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే ఆగస్టు 20 (ఆదివారం) దంబుల్లాలో ప్రారంభం కానుంది.