
హైదరాబాద్: కటక్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. బుధవారం రాత్రి శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 100 పరుగులలోపే ఆలౌటైంది.
46 పరుగుల వరకూ కాస్త నిలకడగా ఆడిన లంక బ్యాట్స్‌మెన్లు ఆ తర్వాత వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. తరంగా(23), కుషల్(19), డిక్వెల్లా(13), చమీరా(12) మినహా మిగితా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరారు. దీంతో శ్రీలంక 16 ఓవర్లు ముగిసేసరికి 87 పరుగులకే కుప్పకూలారు.
తాజా విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకముందు టాస్ గెలిచిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.
శ్రీలంక ఇన్నింగ్స్ సాగిందిలా:
8 ఓవర్లకు శ్రీలంక 49/3
181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ప్రారంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. శ్రీలంక ఓపెనర్లు డిక్‌వెలా, తరంగా దూకుడుగా ఆడి ఆ వెంటనే ఔట్యయ్యారు. 15 పరుగుల వద్ద ఓపెనర్ నిరోషన్ డిక్‌వెలా(13) ఉనద్కట్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేర్చాడు.
దీంతో ఉనద్కట్ అంతర్జాతీయ టీ20లో తొలి వికెట్ సాధించాడు. అనంతరం మరో కీలక ఓపెనర్ ఉపుల్ తరంగా(23) చహాల్ వేసిన 5వ ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్స్ బాది ఆ తర్వాతి బంతికే కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఆ తర్వాత చాహల్ వేసిన 8వ ఓవర్ 2వ బంతికి మ్యాథ్యూస్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
దీంతో శ్రీలంక ప్రస్తుతం 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గుణరత్నే(2), కుషల్ పెరీరా(10) ఉన్నారు. భారత్‌పై విజయం సాధించేందుకు శ్రీలంక 12 ఓవర్లలో 132 పరుగులు చేయాల్సి ఉంది.
క్యాచ్ జారవిడిచిన ధోని
కటక్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో శ్రీలంక తొలి వికెట్ చేజార్చుకుంది. ఓపెనర్ డిక్వెలా (13) పరుగుల వద్ద జయదేవ్ ఉనద్కత్ పెవిలియన్‌కు పంపాడు. ఇదిలా ఉంటే ఇన్నింగ్స్ 3.3వ బంతిని ఉపుల్ తరంగ (23) ఇచ్చిన క్యాచ్‌ని ధోని మిస్ చేశాడు. 5 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. ప్రస్తుతం కుశాల్ పెరీరా (3), ఏంజెలో మాథ్యూస్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
శ్రీలంక విజయ లక్ష్యం 181
కటక్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (61) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 181 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఓపెనర్ శిఖర్ ధావన్ స్ధానంలో జట్టులో చోటు దక్కించుకున్న కేఎల్ రాహుల్ భారీ షాట్లతో లంక బౌలర్లపై చెలరేగాడు. మహేంద్రసింగ్ ధోని (39 నాటౌట్), మనీశ్ పాండే (32 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (24) కెప్టెన్ రోహిత్ శర్మ (17) మెరుపులు మెరిపించారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్, తిసార పెరీరా, నువాన్ ప్రదీప్ తలో వికెట్ తీశారు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ (24) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. నువాన్ ప్రదీప్ వేసిన 12.4వ బంతిని ఆడబోయి కీపర్ డిక్వెలా చేతికి క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తోంది. శ్రేయాస్ ఔటైన తర్వాత ధోని క్రీజులోకి వచ్చాడు. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది.
భారీ షాట్‌కు యత్నించి కేఎల్ రాహుల్ ఔట్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ పెవిలియన్‌కు చేరాడు. మ్యాథ్యూస్ వేసిన 15వ ఓవర్ రెండో బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు రాహుల్ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ను తప్పించుకొని నేరుగా వికెట్లకు తగలడంతో రాహుల్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్రీజులో ధోని(9), మనీష్ పాండే(1) ఉన్నారు.

కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ
కటక్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ లోకేశ్ రాహుల్ (50) హాఫ్ సెంచరీ సాధించాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో రాహుల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 147.0 స్ట్రైక్ రేట్‌తో 34 బంతుల్లో 5 పరుగులు నమోదు చేసి వ్యక్తిగత టీ-20 కెరీర్‌లో రెండో అర్థశతకాన్ని నమోదు చేశాడు. చాలా రోజుల తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్న కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడాడు.
పదో ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కాగా మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా రాహుల్‌కు మద్దతుగా నిలకడగా ఆడుతున్నాడు.10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోయి 84 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (50), శ్రేయాస్ అయ్యర్ (15) పరుగులతో క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన శ్రీలంక.. రోహిత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. ఇక మంచు ప్రభావం అధికంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేయడంతో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది.
పేస్ బౌలర్ విశ్వ ఫెర్నాండో లంక తరఫున టీ20 అరంగేట్రం చేస్తున్నాడు. ఇక ఇండియా తరఫున వన్డే టీమ్‌లో నుంచి రెండు మార్పులు చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ స్థానంలో జైదేవ్ ఉనద్కట్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగే టీ20 సిరిస్‌లో చోటు దక్కించుకున్న హైదారాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. తొలి టీ20లో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయాలనుకున్న మరో యువ పేసర్ బసీల్ థంపీకి నిరాశే ఎదురైంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, అయ్యర్, దినేశ్ కార్తీక్, పాండే, ధోని, పాండ్యా, కుల్దీప్, బుమ్రా, చహల్, ఉనద్కత్
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగ, కుషాల్ పెరీరా, మాథ్యూస్, డిక్‌వెలా, గుణరత్నే, షనక, ధనంజయ, చమీరా, ఫెర్నాండో, ప్రదీప్.