
హైదరాబాద్: టీమిండియా ప్రపంచకప్ అనంతరం విండీస్ పర్యటనకు వెళ్ళింది. విండీస్ పర్యటనలో భాగంగా జరిగిన టీ20, వన్డే, టెస్ట్ సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఈ పర్యటనలో టీమిండియా ఒక్క ఓటమిని కూడా చూడలేదు. అద్భుత ఆటతో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఆ పర్యటనను పరిపూర్ణం చేసింది.
వెస్టిండీస్ పర్యటన అనంతరం సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 15 నుంచి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు పాల్గొంటాయి. సెప్టెంబర్ 15న ధర్మశాలలో తొలి టీ20, 18న మొహాలిలో రెండవ టీ20, 22న బెంగళూరులో మూడవ టీ20 జరగనుంది. అనంతరం 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఉంది. ఇందులో తొలి టెస్ట్ వైజాగ్‌లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అక్టోబరు 2 నుంచి ప్రారంభం కానుంది.
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య అక్టోబరు 2 నుంచి జరిగే తొలి టెస్టు మ్యాచ్ టికెట్ల విక్రయాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు జరుపనున్నట్టు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. ఐదు రోజులకు కలిపి సీజన్ టికెట్ ధరలు రూ.400, రూ.800, రూ.1000, రూ.1500గా నిర్ణయించగా.. ఒక రోజు టికెట్ ధరలు రూ.100, రూ.200, రూ.300, రూ.500గా నిర్ణయించారు. సాగర తీరాన ఉన్న వైజాగ్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం సుమారు 27000. సీట్లు తక్కువగా ఉండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. దీంతో పోటీ ఎక్కువగా ఉంది.